బడ్జెట్: సీనియర్ సిటిజన్లపై కరుణ, పన్ను పరిమితిలో నాలుగు స్లాబులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి నాలుగు కీలక మార్పులను ప్రతిపాదించారు.ఉద్యోగులు, పెన్షనర్ల కోసం స్టాండర్డ్ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టడం కొద్దిగా ఊరట కల్గిస్తోంది. వ్యాపారుల కంటే ఉద్యోగులే ఎక్కువగా ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
2019 ఎన్నికలను పురస్కరించుకొని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించింది. గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకొని మోడీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేసింది.
ఉద్యోగులకు ఎక్కువగా ఈ బడ్జెట్ వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచుతారని భావించినా జైట్టీ మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పుల్లేవ్
వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్యతరగతి ఉద్యోగుల ఆశలపై ఆర్థికమంత్రి నీళ్లు చల్లారు.పన్ను శ్లాబుల్లో మార్పులేమీ చేయకుండా కేవలం స్టాండర్డ్ డిడక్షన్‌తో సరిపెట్టింది. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి నాలుగు కీలక మార్పులను ప్రతిపాదించారు.సుమారు 12 ఏళ్ల తర్వాత ఉద్యోగస్తులు, పెన్షనర్ల కోసం స్టాండర్డ్ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టడమే కొద్దిగా ఊరట కలిగించేలా చేసింది.

ఆదాయపు పన్నుపై 3 నుండి 4 శాతం సెస్
ఆదాయపన్నుపై వేసే సుంకాన్ని 3 నుంచి 4 శాతానికి పెంచారు.తద్వారా పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ శ్లాబును బట్టి రూ.125 నుంచి రూ.2,625 వరకు భారం పడుతుంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు పన్ను ఆదాయమున్న వారు ప్రస్తుతం 5 శాతం పన్ను చెల్లించాలి.ఈ పరిమితిలో ఉన్నవారంతా అదనంగా రూ.125 వరకు చెల్లించాలి. అదే 10శాతం పన్ను పరిధిలో ఉన్నవారంతా గరిష్టంగా రూ.1,125, ముప్పై పన్ను పరిధిలో ఉన్న వారు అదనంగా రూ.2,625 సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్లపై కరుణ
వయో వృద్ధుల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ విధించే పరిమితిని ఐదు రెట్లు పెంచింది. వైద్య చికిత్స వ్యయాలపై పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచారు జైట్లీ. స్థిరాదాయాన్నిచ్చే ప్రధాని వయ వందన యోజన పథకాన్ని 2020 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగులే ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తున్నారు
వ్యా పారులతో పోలిస్తే ఉద్యోగస్తులే ఎక్కువ ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. 2016-17 అసెస్‌మెంట్‌లో 1.89 కోట్ల మంది ఉద్యోగస్తులు రూ. 1.44 లక్షల కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. సగటున ఒక్కో ఉద్యోగి రూ.76,306 చెల్లించారు. కానీ ఇదే సమయంలో 1.88 కోట్ల మంది వ్యాపారులు రూ.48,000 కోట్ల పన్నే చెల్లించారు.












Click it and Unblock the Notifications