Budget 2020: పాత చింతకాయ పచ్చడే, నిరుద్యోగిత కోసం వ్యుహలేవీ..? పద్దుపై రాహుల్ గాంధీ
2020-21కు సంబంధించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. నిరుద్యోగిత సమస్య పరిష్కరించేందుకు ఎలాంటి వ్యుహం అనుసరిస్తున్నారో చెప్పలేదన విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగిత అని చెప్పారు. కానీ అందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించే వ్యుహం ఎక్కడ కనిపించలేదన్నారు.

మాటలే
యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేదని మండిపడ్డారు. వివిధ విభాగాలకు పద్దుల కేటాయింపు గందరగోళంగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం తాము అదీ చేస్తాం, ఇదీ చేస్తామని మాటలు చెబుతుంది కానీ.. ఆచరణలో మాత్రం చేయదని మరోసారి స్పష్టమైందన్నారు. బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ దాదాపు 2.36 గంటల పాటు ప్రసంగించారు. కానీ అన్నీ చెప్పిన అంశాలనే చెప్పారని పేర్కొన్నారు.

పాత చింతకాయ పచ్చడే
బడ్జెట్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దేశం ఏ సమస్యలను ఎదుర్కొంటుంది, నిరుద్యోగిత, మందగమనంపై మాట్లాడలేదు. జీడీపీని 10 శాతం పెంచుతామని చెప్పి ఆశలు కల్పించారని విమర్శించారు.

వీటికి ప్రాధాన్యం
వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయం, నీటిపారుదల రంగానికి 2.83 లక్షల కోట్లను కేటాయించారు. రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి కలిగించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. భూసార పరిరక్షణకు అదనపు సాయం అందజేస్తామని ప్రకటించారు. ఆరోగ్య రంగానికి కూడా రూ.69 వేల కోట్లు కేటాయించారు. గతేడాది కంటే రూ.5 కోట్ల నిధులను పెంచారు.












Click it and Unblock the Notifications