వాటర్ ట్యాంక్ లు సీజ్ చేస్తాం, అప్పుడే నీటి ఆట మొదలైయ్యింది, ఆరోజు వదిలేశారు, ఈ రోజు ?
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో అప్పుడే తాగునీటి కష్టాలతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో కావేరి నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. బెంగళూరు నగర శివార్లలో వారంలో ఒక్కరోజు మాత్రమే కావేరి నీరు వదులుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కావేరి నీటి సరఫరా విషయంలో ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వివాదం జరిగింది.
కావేరి జలాల కోసం ఎన్నో దశాభ్దాల నుంచి కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం కొలువు తీరిన తరువాత కావేరి జలాల పంపిణి విషయంలో తమిళనాడు ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకున్నారని, కావేరి అథారిటీ బోర్డులో సరైన వాదనలు వినిపించకుండా తమిళనాడు రాష్ట్రానికి కావేరి నీరు వదిలేశారని బీజేపీ, జేడీఎస్ నాయకులు ఆరోపించిన విషయం తెలిసింది. తమిళనాడుకు నీరు వదిలేస్తే వేసవిలో బెంగళూరు ప్రజలు తాగునీటి కోసం నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని కొన్ని నెలల క్రితమే బీజేపీ, జేడీఎస్ నాయకులు ఆరోపించారు.

ఇప్పుడు వేసవి కాలం ప్రారంభానికి ముందే బెంగళూరులో తాగునీటి కష్టాలు ఎదురైనాయి. బెంగళూరులోని కేఆర్ పురం, మహదేవపుర, కావేరి నగర, గరుడాచరపాళ్య, సింగనపాళ్య, హుడి, కేఆర్ పురం, ఏ నారయణపుర, దొడ్డనక్కుంది తదితర ప్రాంతాల్లో వారంలో ఒక్క రోజు మాత్రమే నీరు వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా బీడబ్ల్యూఎస్ఎస్ బోర్లు ఎండిపోవడంతో నీటికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది.
ఇదే సమయంలో ప్రైవేట్ నీటి ట్యాంకర్ల యాజమనాలు ట్రాక్టర్ నీళ్లు రూ 1, 200 నుంచి రూ 1, 400 వరకు విక్రయించడం మొదలుపెట్టారు. అంత డబ్బు పెట్టి నీరు కొనుగోలు చెయ్యలేక సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరులో నీటి మట్టం పడిపోయింది. బోరు బావులు మూసుకుపోయాయి. దీంతో కావేరీ నీటికి డిమాండ్ పెరిగిందని జలమండల చైర్మన్ డాక్టర్ రాంప్రసాద్ మనోహర్ స్థానిక మీడియాకు తెలిపారు.

ఎక్కడ నీటి సమస్య వచ్చినా ట్యాంకర్లలో నీటిని సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు. పరిస్థితి విషమిస్తే బెంగళూరు నగరంలోని ప్రైవేట్ ట్యాంకర్లన్నీ సీజ్ చేస్తామని అధికారులు అంటున్నారు. తాగునీటి సమస్య పెరగకుండా చూస్తామని సంబంధిత అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడే ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నీటి సమస్యలు ఎలా ఉంటాయో అంటూ బెంగళూరు ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications