CAA: వారంలోనే దేశ వ్యాప్తంగా సీఏఏ అమలు: కేంద్రమంత్రి సంచలన ప్రకటన
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కేంద్రమంత్రి శంతను ఠాకూర్ సంచలన ప్రకటన చేశారు. సీఏఏ దేశ వ్యాప్తంగా వారం రోజుల్లోగా అమలు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
'కేవలం బెంగాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో సీఏఏ అమల్లోకి వస్తుందని నేను హామీ ఇస్తున్నా. బెంగాల్ సీఎం మాత్రం 1971 తర్వాత భారత్‌కు వచ్చినవారు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్నవారు దేశ పౌరులే అని చెబుతున్నారు. మతువా కులానికి చెందినవారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని వేల మందికి ఓటర్ ఐడీలు జారీ చేసేందుకు తిరస్కరించారు. ఇది వారి రాజకీయ అజెండాకు పనికి వస్తుంది అని మండిపడ్డారు కేంద్రమంత్రి శంతనూ ఠాకూర్.

1971 తర్వాత వలస వచ్చినవారి జీవితాలు బాగుపడటానికి పౌరసత్వం ఉపయోగపడుతుందన్నారు కేంద్రమంత్రి. అందుకే కేంద్రం సీఏఏను తీసుకొచ్చిందని శంతనూ ఠాకుర్ తెలిపారు. బంగాల్‌లోని బంగాన్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు శంతనూ ఠాకుర్. ప్రస్తుత కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా శాంతనూ ఠాకుర్ ఉన్నారు. కాగా, బంగాన్ ప్రాంతంలో ఎక్కువగా మతువా తెగ ప్రజలు ఉంటారు.
సీఏఏ దేశవ్యాప్తంగా వారం రోజుల్లో అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతనూ ఠాకుర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ(MHA) స్పందించింది. సీఏఏ అమలుకు కచ్చితమైన కాలవ్యవధి నిర్ణయించలేదని స్పష్టం చేసింది. 'సీఏఏ అమలుకు కచ్చితమైన కాల వ్యవధి లేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎప్పుడైనా సీఏఏ అమలు కావచ్చు' అని హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.
మరోవైపు, పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్.. సీఏఏపై కేంద్రమంత్రి ఠాకుర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. తమ పార్టీ ఎప్పటికీ బంగాల్‌లో సీఏఏను అమలు చేయదని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే బీజేపీ తప్పుడు వాగ్దానాలు ఇస్తోందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications