
చేతులు మూడుచుకుని చూస్తూ కూర్చోవాలా - సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి- పెద్ద నోట్ల రద్దు. 1,000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన సంచలనాన్ని సృష్టించింది. అప్పటివరకు చలామణిలో ఉన్న ఆయా నోట్లన్నీ ఆ క్షణం నుంచి చిత్తు కాగితాల్లా మారాయి. వాటిని మార్పిడి చేసి, కొత్త నోట్లను తీసుకోవడానికి దేశ ప్రజలందరూ బ్యాంకుల ముందు బారులు తీరి నిల్చున్నారు అప్పట్లో.

నోటీసులు..
ఈ వ్యవహారం ఇప్పుడు మళ్లీ తాజాగా తెర మీదికి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇప్పటివరకు దాఖలైన మధ్యవర్తిత్వపు దరఖాస్తులు, ఇతర పిటీషన్లన్నింటినీ విచారణకు స్వీకరించిన ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం నోటీసులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌కు ఈ నోటీసులు పంపించింది.

అఫిడవిట్ దాఖలుకు..
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మీద ఓ సమగ్రమైన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిర్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం- ఇవ్వాళ పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన పిటీషన్లు, ఇతర దరఖాస్తులపై విచారణ చేపట్టింది. మొత్తంగా 58 పిటీషన్లు దాఖలయ్యాయి.

నల్లధనాన్ని అరికట్టడమే..
తనకు జారీ అయిన నోటీసులకు ఆర్బీఐ సమాధానాలను ఇచ్చింది. కౌంటర్‌ను దాఖలు చేసింది. ఆర్బీఐ తరఫున సీనియర్ అడ్వొకేట్ జైదీప్ గుప్తా వాదనలను వినిపించారు. నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టడానికే పెద్ద నోట్లను రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఒక్క బ్యాంకు కూడా దీని వల్ల నష్టపోలేదని వివరించారు.

కోర్టులు సమీక్షించలేవు..
రాజ్యాంగపరంగా ఎలాంటి ఉల్లంఘనలు కూడా చోటు చేసుకోలేదని వివరించారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ అందజేసిన నివేదికలో ఇదే అంశం ఉందని గుర్తు చేశారు. ఆర్థిక విధానాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానం సమీక్షించబోదని జైదీప్ గుప్తా చెప్పారు. ప్రజలు తమ పాత పెద్ద నోట్లను మార్చుకోనేందుకు అనేక అవకాశాలు కల్పించామని జైదీప్ గుప్తా పేర్కొన్నారు.

చేతులు ముడుచుకుని కూర్చోలేవు..
ఆర్థికపరమైన నిర్ణయాలపై సుప్రీంకోర్టు చేసే సమీక్షలు మెరిట్‌లోకి వెళ్లనప్పటికీ, వాటిని తీసుకున్న విధానాల గురించి న్యాయస్థానాలు ప్రశ్నించవచ్చని.. ఈ రెండు కూడా పూర్తిగా భిన్నమైనవేనిని జస్టిస్ నాగరత్న అన్నారు. ఇది ఆర్థిక విధానం కాబట్టే- న్యాయస్థానం చేతులు ముడుచుకుని కూర్చోదని తేల్చి చెప్పారు. ప్రజలకు ఏది మంచిదో తెలుసునని, ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ విశ్వాసం..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పీ చిదంబరం తన వాదనలను వినిపించారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను న్యాయస్థానానికి సమర్పించాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని, పార్లమెంట్ విశ్వాసాన్ని కూడా తీసుకోలేదని అన్నారు. 1946, 1978లో ఆర్బీఐ పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించినప్పుడు ప్రభుత్వం చట్ట సభల విశ్వాసాన్ని తీసుకుందని అన్నారు.