సిద్ధూ బాధ్యత లేని వ్యక్తి.. చన్నీ సీఎంగా సరిపోరు : కెప్టెన్ అమరీందర్ సింగ్
పంజాబ్ అసెంబ్లీలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీ నేతల్లో కంగారు మొదలైంది. గెలుపుకోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రత్యర్థులపై మాటలు తూటాలు పేల్చుతూ .. ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికారాన్ని మరో సారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు ఆమ్ ఆద్మీ, బీజేపీలు ఈ సారి ఎలాగైనా సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తహతహలాడుతున్నాయి.
Recommended Video
సిద్ధూ బాధ్యత లేని వ్యక్తి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీదల్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సర్వశక్తులా ఒడ్డుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకత్వం తీరుపై మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ విరుచుకుపడ్డారు. పాటియాలాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ర్యాలీలో ఆయన పాల్గొన్నారు . పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బాధ్యత లేని వ్యక్తి అని విమర్శించారు. ఆయన వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప లాభం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి పదవికి సరిపోరని పేర్కొన్నారు . చన్నీ కేవలం మంత్రి పదవికి మాత్రమే పనికివస్తారని ఎద్దేవా చేశారు.

కేజ్రీవాల్‌కు చురకలు
అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా అమరీందర్ సింగ్ చురకలు అంటించారు. పంజాబ్ లో ఆప్ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. ఆప్ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ ఇస్తున్న హామీలపై పెదవి విరిచారు. పంజాబ్ లో అధికారంలోకి వస్తే ప్రతి మహిళలకు నెలకు రూ. 1000 ఇస్తామని చెప్తున్నారని విమర్శించారు. ముందు కేజ్రీవాల్ ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఈ స్కీమ్ అమలు చేసి పంజాబ్ ప్రజలకు వాగ్దానం చేస్తే బాగుటుందని కెప్టెన్ హితవు పలికారు. పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాల వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications