కంపెనీ అంటే ఇది.. వెయ్యి మంది ఉద్యోగులకు ఫ్రీ లండన్ ట్రిప్ !!
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రైవేట్ ఉద్యోగాలు అంటే ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియని భయం అందరికీ ఉన్నదే. మరి ముఖ్యంగా గత కొంత కాలంగా గమనిస్తే కరోనాతో ప్రారంభం అయిన ఈ ఉద్యోగాల ఊచకోత ప్రస్తుతం నడుస్తున్న ఏఐ ట్రెండ్ తో సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతుంది. దిగ్గజ కంపెనీలు సైతం వందల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తుంటే చిన్నా చితకా కంపెనీలు అయితే ఏకంగా దుకాణం సర్దేస్తున్నాయి. దాంతో ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అన్ని రంగాల్లో ఇదే తరహా నడుస్తుండగా జమానా ఇంతే అంటుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఓ దాదాపు 7000 మంది ఉద్యోగులు ఉన్న ఒక కంపెనీ ఏకంగా వెయ్యి మందికి ఫ్రీ గా లండన్ ట్రిప్ ఇవ్వడం అంటే.. చెప్పడానికి మాటలు.. వర్ణించడానికి పదాలు కూడా సరిపోవు.
ఏం జరిగిందంటే..?
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'క్యాసగ్రాండ్' తమ ఉద్యోగులకు లండన్ ట్రిప్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కంపెనీ ఏటా నిర్వహించే "ప్రాఫిట్ షేర్ బొనాంజా"లో భాగంగా ఈసారి వెయ్యి మంది ఉద్యోగులను వారం రోజుల లండన్ పర్యటనకు పంపింది. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల సేవలను గుర్తించడంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు యాజమాన్యం వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

కాగా క్యాసగ్రాండ్ సంస్థకు భారత్, దుబాయ్‌లలో కలిపి 7,000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో 15 శాతం మందిని ఈ ప్రత్యేక పర్యటనకు ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి 6,000 మందికి పైగా ఉద్యోగులు సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, దుబాయ్, స్పెయిన్ వంటి దేశాల్లో పర్యటించారు. ఈసారి లండన్ యాత్ర కోసం హోదా లేదా ర్యాంకులతో సంబంధం లేకుండా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే రకమైన ప్రయాణ, వసతి సౌకర్యాలను కల్పించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ టూర్ లో భాగంగా ఉద్యోగులు సెయింట్ పాల్స్ కేథడ్రల్, లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్, బకింగ్‌హామ్ ప్యాలెస్, మేడమ్ టుస్సాడ్స్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. అంతేకాకుండా థేమ్స్ నదిలో బోట్ షికారును కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాసగ్రాండ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఎంఎన్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా మా ఉద్యోగుల కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం మా సంస్థ విలువలని తెలియజేస్తుందని అన్నారు. అంతే కాకుండా తమ ఉద్యోగుల్లో చాలామంది తొలిసారి విదేశాలకు వెళ్తుండటం ఇంకా ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications