రాహుల్ గాంధీపై కేసు క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాట ఘటనకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యింది. బీజేపీ ఎంపీల ఫిర్యాదు మేరకు పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీనే కారణమని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్‌పై కేసు నమోదైంది.

మరోవైపు, బీజేపీపై కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఫిర్యాదుపైనా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. కాగా, పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు.
మరోవైపు, అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ అధికార బీజేపీకి చెందిన సభ్యలు కూడా నిరసనలకు దిగారు. ఇరువర్గాల పోటాపోటీ నిరసనలతో పార్లమెంట్ ఆవరణలో కొంత ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న తోపులాటలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ తోసివేయడం వల్లే వారు గాయపడ్డారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ ఫిర్యాదు చేసింది.
అయితే, తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు చెప్పారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ ఈ ఆరోపణలు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అధికార, విపక్ష ఎంపీల మధ్య తోపులాట జరుగుతుంటే.. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోకపోవడం చిత్రంగా ఉందన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా స్పీకర్ ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇలావుండగా, పార్లమెంట్ ప్రాంగణంలో మహిళా ఎంపీ పట్ల రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించడాన్ని జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications