ముడా స్కామ్‌లో సీఎం సిద్దరామయ్యపై కేసు నమోదు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మరో షాక్ తగిలింది. ముడా (MUDA) కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుధవారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు సిద్ధరామయ్యపై శుక్రవారం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుటుంబానికి మంగళూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని ఇటీవల హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 156 (సీ) కింద విచారణ చేపట్టాలని, డిసెంబర్ 24 లోపు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇక, ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొనడంతో పాటు ఆయన భార్య పార్వతి, ఆయన బంధువులు మల్లికార్జున స్వామి, దేవరాజు(ఈయన దగ్గరి నుంచి భూమి కొని మల్లికార్జున్.. పార్వతికి ఇచ్చారు), తదితరుల పేర్లను చేర్చారు. కాగా, ముడా స్థలాల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందడం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలాలతో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అబ్రహంతోపాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్ కుమార్ సీఎంపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఆగస్టు 16న సీఎం సిద్దరామయ్యను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు.
కాగా, సిద్దరామయ్యపై కేసు నమోదైన విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్టీ సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సీఎం రాజీనామా చేయాలంటూ చేస్తున్న డిమాండ్లపై ఖర్గే మండిపడ్డారు. ఈ కేసులో ఛార్జ్ షీటు కానీ దోషిగా తేలడం గానీ జరగలేదని చెప్పుకొచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తామని ఖర్గే తెలిపారు. ముఖ్యమంత్రిగా కొనసాగడం సిద్ధరామయ్య నైతిక హక్కు అని అన్నారు.
మరోవైపు, సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని వెనక్కి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా మల్లికార్జున ఖర్గే సమర్థించారు. ఆ నిర్ణయాధికారం తమ పరిధిలోనే ఉందన్నారు. దీంతోపాటు, సీబీఐ పలు కేసుల్లో పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. సీబీఐకి అనుమతి వెనక్కి తీసుకోవడం ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా జరిగాయని అన్నారు.












Click it and Unblock the Notifications