కెసిఆర్‌పై చంద్రబాబు కౌంటర్ వ్యూహం: బాబుపై జగన్ పార్టీ ఎదురు దాడి
హైదరాబాద్ : తాను తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో నోటుకు ఓటు వ్యవహారంలో నేరుగా మాట్లాడినట్లు ఆడియో టేప్ లీక్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ వ్యూహం పన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఎదురుదాడికి ఆయన తన పార్టీ నాయకులను, మంత్రులను సమాయత్తం చేసినట్లు కనిపిస్తున్నారు. కెసిఆర్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు నమోదు చేయడం, ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం వంటి చర్యలకు టిడిపి శ్రేణులు పూనుకున్నాయి.
ప్రతివ్యూహం కోసం చంద్రబాబు సోమవారం ఉదయం టిడిపి నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తమ తమ జిల్లాలకు వెళ్లాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించాలని ఆయన మంత్రులను ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కెసిఆర్‌పై ఎదురుదాడికి దిగారు.
తనకు రాజకీయ ప్రత్యర్థులైన కెసిఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు చెందిన న్యూస్ చానెళ్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. కెసిఆర్‌పై కూడా పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. చంద్రబాబుపై టిఆర్ఎస్ నాయకులు కొద్ది కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ, కెసిఆర్ మాత్రం మాట్లాడడం లేదు.

కాగా, మంత్రివర్గ సమావేశాన్ని కూడా చంద్రబాబు ముందుకు జరిపారు. ఈ నెల 16వ తేదీన జరగాల్సిన మంత్రి వర్గ సమావేశాన్ని 9వ తేదీననే నిర్వహించాలని ఆయన తలపెట్టారు. గోదావరి పుష్కరాలకు ప్రధానిని, రాష్ట్రపతిని ఆహ్వానించే ఉద్దేశంతో ఆయన ఢిల్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు. తనపై విడుదలైన ఆడియో టేప్‌ల వ్యవహారంపై కెసిఆర్ మీద ఆయన ఫిర్యాదు చేస్తారని అంటున్నారు.
కాగా, చంద్రబాబుపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎదురు దాడికి దిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సోమవారంనాడు డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ కూడా చంద్రబాబుపై ఎదురుదాడికి దిగింది. కాంగ్రెసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా రంగంలోకి దిగారు. ఆడియో టేప్‌లోని సంభాషణలు నూటికి నూరు శాతం చంద్రబాబువే అని కాంగ్రెసు నాయకుడు సి. రామచంద్రయ్య అన్నారు.












Click it and Unblock the Notifications