రేప్ఎంజాయ్: సిబిఐ డైరెక్టర్ పశ్చాత్తాపం, బాబు ఆగ్రహం
న్యూఢిల్లీ: రేప్‌ను కట్టడి చేయలేనప్పుడు ఎంజాయ్ చేయాలన్న తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా బుధవారం పశ్చాత్తాపం ప్రకటించారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే అందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.
ఆ వ్యాఖ్యలను తాను ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చారు. తనకు మహిళలు అంటే చాలా గౌరవమని చెప్పారు. వివక్షతో మహిళలను కించపర్చాలన్న ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదన్నారు.

కాగా, బెట్టింగ్‌లపై ఓ సంస్థ నిర్వహించిన డిబేట్‌లో మంగళవారం పాల్గొన్న రంజిత్ సిన్హా బెట్టింగులను అరికట్టడం సాధ్యం కానప్పుడు, దానిని చట్టబద్దం చేయడమే మేలన్నారు. ఈ సందర్భంగా అత్యాచారానికి సంబంధించిన అంశాన్ని ఓ సామెతలా ఉపయోగించారు.
అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అత్యాచారాన్ని అపలేనప్పుడు దానిని అనుభవించడంమేలని సిన్హా ఓ సామెతలా మాట్లాడినప్పటికీ మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెఫ్ట్ పార్టీ నాయకురాలు బృందాకారత్ తదితరులు డైరెక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ డైరెక్టర్ పైన కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయన్నారు. పదవిలో కొనసాగేందుకు ఆయన అనర్హుడన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అంతకుముందు ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటని, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే వ్యవస్థలు ఎంతగా దిగజారాయో అర్థమవుతోందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు.












Click it and Unblock the Notifications