రూ.17,000 కోట్ల మోసం: అనిల్ అంబానీ ఇంటిపై సీబీఐ దాడులు
అనిల్ అంబానీ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అనిల్ అంబానీకి సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులు, కేసుల పరంపరలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.17,000 కోట్ల బ్యాంక్ లోన్ మోసం కేసులో సీబీఐ రంగంలోకి దిగి.. శుక్రవారం ఉదయం ఆయన నివాసంపై దాడులు నిర్వహించింది. ముంబైలోని కఫ్ పరేడ్‌లో ఉన్న అనిల్ అంబానీ నివాసం సహా, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన పలు కార్యాలయాలపై కూడా సీబీఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
ఈ దాడులు ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. 7 నుంచి 8 మంది సభ్యులు గల సీబీఐ బృందం అనిల్ అంబానీ ఇంటికి చేరుకుని, కీలక పత్రాలు, డిజిటల్ డేటాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల సమయంలో అనిల్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ దాడులకు ముందు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈడీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన 50 వ్యాపార సంస్థలు, 25 మంది వ్యక్తుల కార్యాలయాలపై జులై 24న ముంబైలో విస్తృతమైన దాడులు నిర్వహించింది. ఈ దాడుల తర్వాత అనిల్ అంబానీని ఈడీ విచారించింది.

ఈ కేసు ప్రధానంగా యెస్ బ్యాంక్ వ్యవహారాలకు సంబంధించింది. 2017-2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ ద్వారా అనిల్ అంబానీకి చెందిన కంపెనీలకు రూ.17,000 కోట్ల భారీ రుణాలు అక్రమంగా మంజూరు చేయబడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ లోన్ల మంజూరుకు బదులుగా.. యెస్ బ్యాంక్ ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో ముడుపులు అందినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై లంచం, ఇరువర్గాల మధ్య గల ఆర్థిక సంబంధాలను దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
సీబీఐ ఈ కేసులో ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం చేసి, తాజా దాడులు నిర్వహించింది. ఈ సోదాల ద్వారా సేకరించిన సమాచారం, పత్రాలు కేసు దర్యాప్తులో మరింత కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలు అనిల్ అంబానీకి ఈ కేసులో ఎదురయ్యే సవాళ్లను మరింత పెంచుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications