రెండు కళ్లూ చాలవు కదా..!!
ప్రఖ్యాత మైసూర్ దసరా (Mysuru Dasara) ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగా నేడు జంబూ సవారీకి సన్నాహాలు పూర్తయ్యాయి. 415వ దసరా మహోత్సవానికి మైసూర్ ప్యాలెస్ ముస్తాబైంది. ఈ ఉత్సవాలను తిలకించడానికి లక్షలాదిమంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో మైసూరుకు చేరుకుంటోన్నారు. ఈ తెల్లవారు జాము నుంచీ మైసూరు.. సందర్శకులతో కిటకిటలాడుతోంది.
పండగ ఆచారాల్లో భాగంగా ఈ ఉదయం 9:30 నుండి 10 గంటల మధ్య పట్టపు ఏనుగులు, గుర్రాలు, ఆవులు, ఖాసా ఆయుధాలతో అంబావిలాస్ ప్యాలెస్ లో వాహనాలకు పూజలు చేస్తారు. ఉదయం 9:45 నిమిషాలకు వజ్రముష్టి కాళగ జరుగుతుంది. ఆ తర్వాత 10:50 నుండి 11:10 గంటల వరకు శమీ పూజ నిర్వహిస్తారు. అనంతరం- ప్యాలెస్ ప్రాంగణంలోని భువనేశ్వరి దేవాలయానికి విజయోత్సవ యాత్ర సాగుతుంది.

ఉదయం 10 నుండి 10:30 గంటల మధ్య, చాముండి కొండల నుండి అమ్మవారి విగ్రహాన్ని ప్యాలెస్ కు తీసుకువస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి 1:08 నిమిషాల మధ్య ధనుర్ లగ్నంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. నందిధ్వజానికి పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:40 నిమిషాల తర్వాత.. బంగారు అంబారిని కడతారు. సాయంత్రం 4:42 నుండి 5:06 నిమిషాల వరకు పుష్పార్చన జరుగుతుంది.
ప్యాలెస్ నుండి బన్నీ మండపం వరకు జంబూ సవారీ కొనసాగుతుంది. ఈ సవారీలో కేప్టెన్ అభిమన్యు అనే ఏనుగు అంబారీని మోస్తుంది. సాయంత్రం 7 గంటలకు పంజీనా కవాతు జరుగుతుంది. ఈ జంబూ సవారీలో అభిమన్యుతో పాటు ఇతర ఏనుగులు కూడా పాల్గొంటాయి. కుమ్కీ ఏనుగులు కావేరి, రూప, నిషానె ఏనుగు ధనంజయ, నౌపత్ ఏనుగు గోపి, సాలానె ఏనుగు భీమ.. జంబూ సవారిలో ఆలరించనున్నాయి.
పట్టపు ఏనుగులు శ్రీకంఠ, లక్ష్మితో పాటు మహేంద్ర, కంజన్, ఏకలవ్య, ప్రశాంత, సుగ్రీవ, హేమావతి వంటి ఏనుగులు కూడా ఈ సవారీలో భాగం అవుతాయి. ఈసారి అంబావిలాస్ అరమనా ఆవరణలో 48,000 మందికి సీటింగ్ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం 60,000 మందికి పైగా ప్రజలకు అనుమతించారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట సంఘటనల దృష్ట్యా, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం భద్రతా చర్యలలో భాగంగా వీక్షకుల సంఖ్యను తగ్గించింది. ప్యాలెస్ ఆవరణలో పోలీసు భద్రతను పెంచారు.
పాస్‌లు ఉన్న వారికి మాత్రమే ప్యాలెస్ లోనికి దసరా వీక్షించడానికి అనుమతి ఉంది. ఉదయం 11 గంటల తర్వాత పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు. కాగా నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 9,000 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అంబారీ వెళ్లే ప్రధాన మార్గం సహా నగర వ్యాప్తంగా అదనపు సీసీటీవీలను అమర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా ఉంచింది.












Click it and Unblock the Notifications