TV చూసే వారికి కేంద్రం షాక్, 20 ఏళ్ల తర్వాత మారిన రూల్స్
బుల్లితెర ప్రేక్షకులకు, ముఖ్యంగా టీవీ సీరియళ్లు, సినిమాలు, వార్తలు రోజూ చూసేవారికి కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు గంటకు ఇన్ని నిమిషాలు మాత్రమే అడ్వర్టైజ్‌మెంట్లు వేయాలనే కఠినమైన నిబంధన ఉండేది. కానీ, ఇప్పుడు ఆ నిబంధనను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ సవరణ నిబంధనలు - 2026 పేరిట అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిజానికి టీవీ ఛానెళ్లలో యాడ్స్ ప్రసారంపై 2006లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఏ టీవీ ఛానెల్ అయినా సరే గంట వ్యవధిలో కేవలం 12 నిమిషాలకు మించి అడ్వర్టైజ్‌మెంట్లు ప్రసారం చేయకూడదు. అంటే ప్రేక్షకుడు చూసే ప్రసారంలో 48 నిమిషాలు కంటెంట్ ఉంటే, 12 నిమిషాలు యాడ్స్ ఉండేవి.
కానీ, అప్పటి పరిస్థితులకు, ఇప్పటి మార్కెట్ కి చాలా తేడా వచ్చింది. 2006లో దేశంలో కేవలం 62 టీవీ ఛానెళ్లు మాత్రమే ఉండేవి. కానీ, ఈరోజు ఆ సంఖ్య ఏకంగా 900 దాటిపోయింది. దీంతో పాత రూల్స్ ఇక చెల్లవని భావించిన ప్రభుత్వం, ఆ 12 నిమిషాల పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

డిజిటల్ విప్లవంతో మారిన రూపురేఖలు
ఒకప్పుడు కేబుల్ వైర్ల ద్వారా వచ్చే ఛానెళ్లు పరిమితంగా ఉండేవి. క్వాలిటీ కూడా తక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ రావడంతో డీటీహెచ్, ఐపీటీవీ, కేబుల్స్ ద్వారా వందల కొద్దీ ఛానెళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో ప్లాట్‌ఫామ్‌పై 300 నుంచి 500 కంటే ఎక్కువ ఛానెళ్లు వస్తున్నాయి. వినియోగదారులకు నచ్చిన కంటెంట్ ఎంచుకునే స్వేచ్ఛ పెరిగింది. ప్రసార రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ మార్పులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా నిబంధనలను సవరించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
పోటీ తట్టుకోవడానికే ఈ నిర్ణయమా?
ప్రస్తుతం యూట్యూబ్, ఓటీటీ వంటి డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. డిజిటల్ మీడియాలో ప్రకటనలపై ఎలాంటి పరిమితులు లేవు. కానీ, సంప్రదాయ టీవీ ఛానెళ్లకు మాత్రం 12 నిమిషాల నిబంధన ఉండటంతో సమానమైన పోటీ వాతావరణం లేకుండా పోయింది. పెయిడ్ ఛానెల్ అయినా, ఫ్రీ ఛానెల్ అయినా.. టీవీ పరిశ్రమ ప్రధానంగా యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి నడుస్తుంది. డిజిటల్ మీడియాతో టీవీ ఛానెళ్లు పోటీ పడటానికి, ప్రసార రంగానికి ఊపిరి పోసి వ్యాపారాన్ని సులభతరం చేయడానికే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఈ కొత్త నిర్ణయం తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications