నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.12,328 కోట్లతో !
భారతదేశంలో రైల్వే మౌలిక వసతులను విస్తరించి, కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అందుకోసం రూ.12,328 కోట్ల భారీ వ్యయం కేటాయించనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో కొత్తగా 565 కిలోమీటర్ల లైన్లు చేరనుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ-కర్ణాటక రైల్వే కనెక్టివిటీకి గ్రీన్ సిగ్నల్..
ఈ నిర్ణయాల్లో ప్రధానంగా నిలిచింది సికింద్రాబాద్ - వాడి మధ్య మూడవ, నాలుగవ లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు. సుమారు 173 కిలోమీటర్ల పొడవున నిర్మించబడే ఈ లైన్ల కోసం రూ.5,012 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఐదేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే రాకపోకలు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ణయంతో దాదాపు 47.34 లక్షల జనాభా నేరుగా లబ్ధిపొందనున్నారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాగా గుర్తించిన కర్ణాటకలోని కలబురగి జిల్లా అభివృద్ధికి ఇది మైలురాయిగా మారనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరో మూడు కీలక ప్రాజెక్టులు..
సికింద్రాబాద్-వాడి లైన్లతో పాటు గుజరాత్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో కూడా కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- గుజరాత్‌లో పరిశ్రమల హబ్‌లను కనెక్ట్ చేస్తూ మౌలిక వసతులు పెంపు.
- బీహార్‌లో అధిక జనాభా గల ప్రాంతాల్లో రైలు రద్దీ తగ్గించే లైన్ విస్తరణ.
- అస్సాంలో ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసే పనులు.
- ఈ మూడు ప్రాజెక్టులు ప్రాంతీయ అసమానతలు తగ్గించి, సమతుల అభివృద్ధికి దోహదపడనున్నాయి.
ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ నాలుగు ప్రాజెక్టుల నిర్మాణం సమయంలో సుమారు 251 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి కలుగనుంది. దీనివల్ల స్థానిక ప్రజలకు తక్షణ ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా, ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత దీర్ఘకాలిక ఆర్థిక లాభాలు కూడా అందనున్నాయి. కొత్త లైన్లు అందుబాటులోకి రాగానే ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రైళ్ల రాకపోకల్లో జాప్యం గణనీయంగా తగ్గుతుంది.
బొగ్గు, సిమెంట్, స్టీల్, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక వస్తువుల రవాణా మరింత వేగవంతం కానుంది. ఫలితంగా పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తుల సరళ రవాణా, వ్యాపార వాణిజ్య విస్తరణకు ఇది దోహదపడనుంది.












Click it and Unblock the Notifications