బంగారంపై భారీగా సుంకం పెంచిన కేంద్రం: 22వ తేదీ నుంచే అమలు
Gold and Silver: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. బంగారం, వెండి దిగుతులపై భారీగా సుంకాన్ని పెంచింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బంగారు, వెండి నాణేలకూ ఇది వర్తిస్తుంది. ఫలితంగా- ఈ రెండింటి రేట్లు మరింత భారీగా పెరగడం ఖాయమైంది.
దిగుమతి చేసుకునే బంగారం, వెండి దిగుమతులపై ఇప్పుడు వసూలు చేస్తోన్న ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతం మేర పెంచింది. అంటే- ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకం కంటే కూడా అదనంగా 15 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తక్షణమే ఈ ఉత్తర్వులు జనవరి 22వ తేదీ నుంచే అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది.

మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఈ ఉదయం నుంచీ ఎగబాకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఈ ఉదయం 10:05 నిమిషాలకు నమోదైన ట్రేడింగ్ ప్రకారం.. 0.12 శాతం మేర ఈ పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల ధర 61,964 రూపాయలుగా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. రూపాయితో పోల్చుకుంటే అమెరికన్ డాలర్ విలువ క్షీణించడం వల్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల చోటు చేసుకుందని అంచనా వేస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య ఇప్పుడిక కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనివల్ల మున్ముందు పసిడి రేటు మరింత పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట, రామమందిరాన్ని ప్రారంభించిన రోజే.. బంగారం, వెండి ఇంపోర్ట్ డ్యూటీని పెంచడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications