ఆరు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ హైకోర్టుకు జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ అరుణ్ భన్సాలీ, గువాహటి హైకోర్టుకు జస్టిస్ విజయ్ బిష్ణోయ్, ఉత్తరాఖండ్ హైకోర్టుకు జస్టిస్ రితూ బహ్రీ, ఒడిశా హైకోర్టుకు జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్, మేఘాలయ హైకోర్టుకు జస్టిస్ ఎస్ వైద్యనాథన్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ అరుణ్ భన్సాలీ, జస్టిస్ విజయ్ బిష్ణోయ్, జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ ఎస్ వైద్యనాథన్, జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్, జస్టిస్ రితు బహ్రీలను ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని గత నవంబర్ నెలలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

కాగా, రాజస్థాన్ హైకోర్టుకు సీజేగా నియమితులైన జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ ప్రస్తుతం అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ అరుణ్ భన్సాలీ, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లు ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారు.
జస్టిస్ రితు బహ్రీ ప్రస్తుతం పంజాబ్-హర్యానా హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్ ప్రస్తుతం పాట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉండగా, జస్టిస్ ఎస్ వైద్యనాథన్ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో జడ్జీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications