కాక్రోచ్ నేతలకు అమెరికా నిధులు, పాకిస్తాన్ సంబంధాలు- కేంద్రం సంచలన ఆరోపణలు..!
భారత్ లో నీట్ అక్రమాలపై, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అక్రమాలపై పలు ఉద్యమాలు చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలపై ఇవాళ కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కేతో పాటు మరో నేత అశుతోష్ రాంకాను టార్గెట్ చేసుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ ఆరోపణలు చేశారు. వీరిలో అభిజీత్ దిప్కేకు అమెరికా నుంచి నిధులు అందుతున్నాయని, అశుతోష్ రాంకాకు పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
అనధికారిక వనరుల నుండి, దేశంలోని, దేశం వెలుపల ఉన్న భారత్ వ్యతిరేక ఎన్జీవోలు, భారత్ వ్యతిరేక సంస్థల నుండి వారికి నిధులు అందుతున్నాయని చూపించడానికి తగినన్ని సాక్ష్యాలు ఉన్నాయని జితేంద్ర సింగ్ ఆరోపించారు. విదేశీ నిధులతో నడిచే ఎన్జీవోలు, డీప్ స్టేట్ ఆపరేటివ్‌లు, భారత్ వ్యతిరేక శక్తులు వీళ్లను నడిపిస్తున్నాయని ఆయన తెలిపారు. అభిజీత్ దిప్కేకు అమెరికాలో ఉన్న దాతల నుండి నిధులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. అలాగే అశుతోష్ రాంకాకు పాకిస్థానీ రాజకీయ నాయకుల నుండి డబ్బులు అందాయని పేర్కొన్నారు.

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన ఆరోపణలను తిరస్కరించడమే కాకుండా, ఉన్నత రాజ్యాంగ, రాజకీయ పదవులలో ఉన్నవారు చేసే ప్రకటనల విశ్వసనీయతను కూడా ప్రశ్నించింది. ఇదే సిగ్గుచేటైన వాస్తవమని ట్వీట్ చేసింది. ఒక కేంద్ర మంత్రి ఏమైనా మాట్లాడవచ్చు, ఎటువంటి పరిణామాలు లేకుండా తప్పించుకోగలడని తెలిపింది.అందుకే, అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు పలికే మాటలకు కూడా ఇవాళ ఏమాత్రం విలువ లేదని సీజేపీ వ్యాఖ్యానించింది. తనకు పాకిస్తాన్ రాజకీయ నేతల నుంచి నిధులు అందుతున్నట్లు కేంద్రమంత్రి చేసిన ఆరోపణలపై అశుతోష్ రాంకా వ్యంగంగా స్పందించారు. పేపర్ లీక్ చేసింది, స్కూళ్లు నాశనం చేసింది, ఓట్ల చోరీ చేసిందీ, నిరుద్యోగుల్ని తయారు చేసిందీ పాకిస్తానే అంటూ ట్వీట్ చేశారు.













Click it and Unblock the Notifications
