ఏపీలో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల ఖరారు-ఎస్ఈసీ షెడ్యూల్..!
ఏపీలో ప్రత్యక్ష విధానంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పరోక్ష విధానంలో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల కోసం ఎస్ఈసీ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పోరేషన్లలో డిప్యూటీ మేయర్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్ ఛైర్మన్ పోస్టులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 23న ఆయా కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఎస్ఈసీ (AP SEC) ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్రంలో తాజాగా ఎన్నికలు జరిగిన విజయవాడ, గ్రేటర్ విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం నగరపాలక సంస్థల్లో డిప్యూటీ మేయర్ల ఎన్నికలు ఈనెల 23న నిర్వహిస్తారు. వీటితో పాటు 87 మున్సిపాలిటీల్లోనూ అదే రోజు వైస్ చైర్మన్లకు పరోక్ష ఎన్నికలు ఉంటాయి. వీటికి సంబంధించి ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలకు ఈ నెల 18లోపు నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. సంబంధిత జిల్లా కలెక్టర్ లేదా ఎన్నికల అథారిటీ ద్వారా అధికారం పొందిన జాయింట్ కలెక్టర్ ఈ నోటీసును జారీ చేయాల్సి ఉంటుంది. సంబంధిత నగరపాలక సంస్థల మేయర్, ఎన్నికైన సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులకు నోటీసులు అందజేయాలి. అనంతరం 23న ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.

ఏదైనా కారణంతో నవంబర్ 23న డిప్యూటీ మేయర్ లేదా వైస్ ఛైర్మన్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే మాత్రం ఈ నెల 24న ఉదయం 11 గంటలకు వీటిని నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఆ రోజు సెలవు ఉన్నా లేకపోయినా ఎన్నికలు మాత్రం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఎన్నికలు నిర్వహించలేకపోతే తదుపరి ఎన్నికల తేదీని నిర్ణయించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు కారణాలతో సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఎస్ఈసీ స్థానిక అధికారుల నివేదికల ఆధారంగా తదుపరి తేదీల్ని నిర్ణయిస్తుంది.














Click it and Unblock the Notifications
