ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం సంచలనం నిర్ణయం..!!
న్యూఢిల్లీ: ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాలు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్రం ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు, బిల్లులను ప్రవేశపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించారు. అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం లేదా, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నికల జోష్‌ను మరింత పెంచేలా ఉందా నిర్ణయం. దేశవ్యాప్తంగా 75 లక్షల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను ఉచితంగా మంజూరు చేయనుంది. వచ్చే మూడు సంవత్సరాల కాలంలో.. అంటే 2026 నాటికి ఈ 75 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్ల జారీ ప్రక్రియను పూర్తి చేయనుంది.
సంవత్సరానికి 25 లక్షలు చొప్పున గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తుంది. ప్రధానమంత్రి ఉజ్జీవన్ పథకం కింద వాటిని కేటాయిస్తుంది. ఈ మేరకు దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం 1,650 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేసింది.
దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. దీనితో ఉజ్జీవన్ పథకం కింద మంజూరయిన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుంది. కాగా రూ.7,210 కోట్ల రూపాయలతో ఈ-కోర్టుల ప్రాజెక్ట్ ఫేజ్ 3కీ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్, పేపర్‌లెస్ కోర్టులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దీన్ని చేపట్టింది కేంద్రం.












Click it and Unblock the Notifications