యాపిల్ దిగుమతులను నిషేధించిన కేంద్రం: కేజీ ధర రూ.50 కంటే తక్కువ ఉంటే
న్యూఢిల్లీ: యాపిల్ దిగుమతుల పాలసీలో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలను చేసింది. దిగుమతులపై నిషేధాన్ని విధించింది. కేజీ యాపిల్ ధర 50 రూపాయల కంటే తక్కువగా ఉండే యాపిల్ దిగుమతులకు ఈ నిషేధాన్ని వర్తింపజేసింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు వివిధ దేశాల నుంచి దిగుమతి అయ్యే యాపిళ్లపై ఈ నిషేధం కొనసాగుతుంది. ఈ జాబితా నుంచి పొరుగునే ఉన్న భూటాన్‌ను మినహాయించింది కేంద్రం.
ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే విభాగం ఇది. యాపిల్ ఉత్పత్తికి ఖర్చు అయ్యే ధర, పంట బీమా, రవాణా (కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్- సీఐఎఫ్) వ్యయాన్ని కలుపుకొని కేజీకి 50 రూపాయల కంటే తక్కువ ధర పలికే యాపిల్ దిగుమతులను నిషేధించినట్లు డీజీఎఫ్‌టీ తెలిపింది.

ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తి తక్కువే. దిగుమతి చేసుకోవడానికి పెద్ద ఎత్తున విదేశాల మీదే ఆధారపడుతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్.. యాపిల్‌ను ఉత్పత్తి చేస్తోన్నాయి. ప్రతి సంవత్సరం సగటున 1,158 మెట్రిక్ టన్నుల మేర యాపిల్ ఉత్పత్తవుతుంది ఆయా రాష్ట్రాల్లో. వాతావరణ ప్రభావం మీద ఆధారపడి ఈ అంకెలు మారుతుంటాయి.
డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ లేకపోవడం వల్ల వివిధ దేశాల నుంచి చేసుకుంటోంది. ప్రధానంగా బంగ్లాదేశ్, బహ్రెయిన్, కువైట్, శ్రీలంక, మాల్దీవులు, మలేసియా, భూటాన్, నేపాల్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్‌కు యాపిల్ దిగుమతి అవుతోంది. ఇందులో ప్రధాన వాటా బంగ్లాదేశ్‌దే. తాజాగా కేజీకి సీఐఎఫ్ వ్యయం 50 రూపాయల కంటే తక్కువగా ఉండే యాపిల్ దిగుమతిపై నిషేధం విధిస్తూ పాలసీలో సవరణలు చేసింది.












Click it and Unblock the Notifications