నేతాజీ మృతి ఫైళ్లు గుట్టు, విదేశీ సంబంధాలపై ప్రభావమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం అనుసరించిన విధానానే్న పాటిస్తూ ఆ ఫైళ్లను వెల్లడించడానికి నిరాకరించింది. దానికితోడు వాటిని బహిరంగ పరచడంలో విస్తృతమైన ప్రజా ప్రయోజనం ఇమిడి ఉందన్న వాదనను సైతం తిరస్కరించింది.
ఏవయినా ఫైళ్లను బైటపెట్టడం వల్ల ప్రజా ప్రయోజనంకన్నా హానే ఎక్కువ జరుగుతుందని భావించిన పక్షంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఆ రికార్డులను బయట పెట్టకుండా ఉండడానికి సమాచార హక్కు చట్టం అనుమతిస్తోంది. 70 ఏళ్ల క్రితం స్వాతంత్య్ర సమర యోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ నాయకుడు నేతాజీ మృతికి సంబంధించిన రికార్డులను బయటపెట్టడం ద్వారా విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందడానికి సంబంధించిన మిస్టరీపై స్పష్టత ఇవ్వాలని పౌర హక్కుల ఉద్యమ కార్యకర్త సుభాష్ అగర్వాల్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు.

అయితే ఒక విదేశంతో సంబంధాలపై ప్రభావం చూపించే సమాచారాన్ని వెల్లడించనక్కర లేదన్న సమాచార హక్కు చట్టంలోని నిబంధనను ఉటంకిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఆ రికార్డులను వెల్లడించడానికి నిరాకరించింది.
గతంలో యుపిఏ ప్రభుత్వం కూడా ఇదే వాదన చేస్తూ ఆ రికార్డులను బైటపెట్టడానికి నిరాకరించడం తెలిసిందే.
అంతేకాదు, ఈ సమాచారం బహిర్గతమైతే సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్న దేశాలేవో కూడా వెల్లడించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం నిరాకరించింది.












Click it and Unblock the Notifications