డాక్టర్ల దేశవ్యాప్త సమ్మెపై స్పందించిన కేంద్రం-కీలక ప్రకటన..!
కోల్ కతాలోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలు చేపడుతున్నారు. ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించి ఒక్క రోజు నిరసన చేపట్టారు. దీంతో వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. చాలా రాష్ట్రాల్లో రోగులకు వైద్యం అందక విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న వైద్యులు, వైద్య విద్యార్థులను తిరిగి విధుల్లో చేరాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోరింది. ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రత కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని వారికి హామీ ఇచ్చింది.కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రతకు సంబంధించిన చర్యలను సూచించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని శాఖ ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇందులో భాగస్వాములైన అందరు ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి తమ సూచనలను తెలిపేందుకు ఆహ్వానిస్తామని తెలిపింది.

ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఢిల్లీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఇవాళ కలిశారు. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దేశంలోని డాక్టర్ల భద్రతపై హామీకి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.












Click it and Unblock the Notifications