22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు..! వినియోగదారులకు కేంద్రం మరో శుభవార్త..!
దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. గతంలో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్ ల స్ధానంలో కేంద్రం రెండు స్లాబ్ లకు కుదించడంతో దీని ప్రభావం చాలా వస్తువులపై పడబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వినియోగదారులకు ఓ కీలక సూచన చేస్తోంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తుండటంతో ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వస్తువుల విషయంలో కేంద్రం వినియోగదారులకు కీలక సూచన చేస్తోంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వస్తువులకు ఎలాగో కొత్త జీఎస్టీ స్లాబ్ ల ప్రకారం ధరలు ముద్రించి పంపుతారు. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న వస్తువులకు సైతం కొత్తగా మారే జీఎస్టీ స్లాబ్ ల ప్రకారమే ధరలు నిర్ణయించి అమ్మాల్సి ఉంటుంది. అలా కాకుండా పాత రేట్లకు అమ్మితే నేరమవుతుంది.

దీంతో వినియోగదారుల మంత్రిత్వశాఖ వస్తువుల్ని ఉత్పత్తి చేసే కంపెనీలు సెప్టెంబర్ 22 లోపే మార్కెట్లో ఉన్న తమ వస్తువులకు ఎమ్మార్పీ రేట్లను కొత్త జీఎస్టీ స్లాబ్ ల ప్రకారం తగ్గించి అమ్మాలని ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం పాత ఎమ్మార్పీ రేట్లతో పాటు కొత్త ఎమ్మార్పీ రేటును సైతం స్టిక్కర్లు అతికించి అమ్మాలని సూచిస్తోంది. అలాగే కొత్తగా మార్కెట్లోకి పంపే వస్తువులకు కొత్త జీఎస్టీ స్లాబ్ ల ప్రకారం ఎమ్మార్పీ రేట్లు నిర్ణయించి ముద్రించాలని ఆదేశాలు ఇస్తోంది. దీంతో వినియోగదారులకు ప్రయోజనం కలగబోతోంది.

గతంలో కంపెనీలు సవరించిన ఎమ్మార్పీలను కనీసం రెండు వార్తాపత్రికలలో ప్రకటించమని కేంద్రం సూచించేది. దీన్ని ఈసారి మినహాయించాచుర. దీనికి బదులుగా కొత్త ధరల జాబితాలను డీలర్లు, రిటైలర్లకు మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది. అలాగే వీటి కాపీలను లీగల్ మెట్రాలజీ అధికారులకు అందించాలి. పాత ప్యాకేజింగ్‌ను మార్చి 31, 2026 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు అమ్ముకోవచ్చు. అయితే పాత ప్యాకేజింగ్‌పై ఎమ్మార్పీలను స్టిక్కర్లు, స్టాంపులు లేదా డిజిటల్ ప్రింటింగ్ ఉపయోగించి సరిచేయవచ్చని కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications