Watch Video:ఏంటి భయ్యా..ఇంతందంగా ఉన్నారు..!!
కొల్లాం:కేరళలోని కొట్టంకులంగర శ్రీదేవి ఆలయంలో జరిగే ప్రత్యేకమైన చామయవిలక్కు పండుగ ఈ సంవత్సరం మార్చి నెలలో ఘనంగా జరిగింది. ఈ పండుగలో పురుషులు మహిళల్లా అలంకరించుకుని అమ్మవారికి పూజలు చేయడం విశేషం. పది రోజుల పాటు జరిగే ఈ వార్షిక ఉత్సవం చివరి రోజున వేలాది మంది పురుషులు స్త్రీ వేషధారణలో ఆలయానికి తరలివస్తారు.
పురుషులు చీరలు ధరించి, నగలు పెట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని, పూర్తి మహిళా రూపంలో దర్శనమిస్తారు.కొందరు మీసాలు కూడా తీసేసి,మేకప్ వేసుకుని మరింత సహజంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. స్థానికులే కాకుండా కేరళలోని వివిధ ప్రాంతాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ ప్రత్యేక ఉత్సవంలో పాల్గొంటారు. ట్రాన్స్‌జెండర్ వర్గం కూడా ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.

చామయవిలక్కు పండుగ చరిత్ర
స్థానికుల కథనం ప్రకారం,పూర్వం గోపబాలకురులు ఒక రాయిని దేవుడిగా భావించి అమ్మాయిల్లా వేషం వేసుకుని ఆడుకునేవారు. ఒకరోజు ఆ రాయి నుండి అమ్మవారు ప్రత్యక్షమయ్యారని చెబుతారు. ఆ సంఘటనతో ఆ రాయిని పవిత్రంగా భావించి ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుండి పురుషులు స్త్రీ వేషధారణలో అమ్మవారిని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని నమ్ముతారు. భక్తులు చామయవిలక్కు దీపాలను వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు, తద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని విశ్వసిస్తారు.
భక్తుల సందడి, ప్రత్యేక పూజలు
మార్చి నెలలో జరిగే ఈ పండుగను చూడటానికి వేలాది మంది భక్తులు కొట్టంకులంగర ఆలయానికి తరలివస్తారు. ముఖ్యంగా ఉదయం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆలయాన్ని సందర్శించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆలయం వెలుపల చామయవిలక్కులు అద్దెకు లభిస్తాయి, అలాగే స్త్రీ వేషధారణ కోసం తాత్కాలిక బ్యూటీషియన్ షాపులు కూడా ఏర్పాటు చేస్తారు.
చాలా మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి, రుణ బాధలు తొలగించుకోవడానికి, పాపాలు క్షమించమని వేడుకోవడానికి ఈ ఆలయానికి వస్తారు. కాలక్రమేణా ఈ ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. విశ్వాసం, ప్రత్యేక సంప్రదాయం కలగలిసిన ఈ చామయవిలక్కు పండుగ కేరళ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.












Click it and Unblock the Notifications