టీపై ఎన్ఐసి సమావేశం నుంచి బాబు వాకౌట్
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా మండలి (ఎన్ఐసి) సమావేశం నుంచి సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వాకౌట్ చేశారు. తెలంగాణ అంశాన్ని చర్చించకపోవడంపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. రాజకీయ ప్రయోజనం కోసమే రాష్ట్రంలో కాంగ్రెసు సమస్యలు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు
ఎన్ఐసి సమావేశం నుంచి వాకౌట్ చేసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలను ఎన్ఐసి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు దేశంలో ఉండే మేధావులు రాష్ట్ర విభజనపై ఆలోచించాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆయన విమర్శించారు. ఇరు ప్రాంతాల నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రస్తావించవద్దని అడ్డుకున్నారు. అందుకే ఎన్ఐసీ సమావేశాన్ని బహిష్కరించినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవద్దని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం అడ్డుకున్నారని అన్నారు. సమావేశంలో తెలుగువారికి అవమానం జరిగిందని, అందుకే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశామని చంద్రబాబు ఆవేదనగా పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీటు కోసం పాకులాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కనీసం తనకు మద్దతు తెలపలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్రం తగలబడుతుంటే ఎన్ఐసీలో చర్చించాల్సిన అవసరం లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు లేనట్లే సీఎం ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
అస్సాం రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఎన్ఐసీలో అవకాశం కల్పించారనే మీడియా మాటకు చంద్రబాబు మాట్లాడుతూ - ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని, తెలుగుదేశం ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో ఎలా పోరాటం చేయాలో తెలుసునని, అలాగే ఢిల్లీలో కూడా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications