చెన్నైలో మళ్లీ వర్షం: సహాయక చర్యలకు ఆటంకం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో మళ్లీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. శుక్రవారం ఉదయం వరకు తెరిపినిచ్చిన వర్షం మధ్యాహ్నం నుంచి మళ్లీ కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
కాగా, ఈ వర్షాలు గతంలో కురిసిన వర్షాలు మాదిరిగా ఉండవని అల్పపీడన ద్రోణి వల్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిలోనే తేలియాడుతున్నాయి. ఈ స్థితిలో తాజాగా వర్షం రావడంతో ప్రజల జీవితాలు కనాకష్టంగా తయారయ్యే ప్రమాదం ఉంది.

రైళ్లు రద్దు
ఇదిలావుంటే, భారీ వర్షాల వల్ల చెన్నై-గూడూరు మధ్య 6 రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారంనాటిడెహ్రాడూన్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, ధన్‌బాద్-అలెప్పి, పాట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్, ధన్‌బాద్-అలెప్పి, పాట్నా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్, గువాహటి-త్రివేండ్రం, దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేశారు. మరో ఐదు రైళ్లు దారిమళ్లించినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
విశాఖ నుంచి ఆహారపదార్థాలు
ఆహార పదార్థాలు, మంచినీరు, ఇతర నిత్యావసర సరకులతో విశాఖ నుంచి బయల్దేరిన రెండు నౌకలు శుక్రవారం ఉదయం చెన్నైకి చేరుకున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు తూర్పు నౌకాదళం రంగంలోకి దిగింది.
హెలికాప్టర్‌ని కూడా నౌకలో తీసుకువచ్చారు. జెమిని బోట్లు, గజ ఈతగాళ్లు, దుప్పట్లు, జనరేటర్లు కూడా ఈ నౌకలో తరలించారు. వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు నేవీ సిబ్బంది రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications