సెలవుల కోసం ఘర్షణ: తోటి జవాన్ కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి, ముగ్గురికి గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని పారామిలిటరీ బలగాల శిబిరంలో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా పరిధిలోలోని లింగంపల్లి బేస్ క్యాంప్‌లో సోమవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో జవాన్ల మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ రితేష్ రంజన్ తన సర్వీసు తుపాకీ ఏకే-47తో తోటి జవాన్లపై కాల్పులకు పాల్పడినట్లు రాయ్‌పూర్ ఐజీ(బస్తర్ రేంజ్) సుందర్ రాజు తెలిపారు.

ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నలుగురు జవాన్లు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతి చెందిన జవాన్లను రాజమణి కుమార్ యాదవ్, రాజవివ్ మండల్, ధన్‌జీ, ధర్మేంద్ర కుమార్‌గా గుర్తించారు.
గాయపడిన మరో ముగ్గురికి భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే, వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ కు తరలించారు. కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ రితేష్ రంజన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెలవులు విషయంలో జవాన్ల మధ్య తలెత్తిన గొడవ, కాల్పులకు దారితీసినట్లు పోలీసు వర్గాల సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.












Click it and Unblock the Notifications