ఛత్తీస్‌గడ్ ఎన్నికలు : హామీలతో కాంగ్రెస్ అభయ హస్తం..
ఛత్తీస్‌గడ్‌లో శాసనసభ ఎన్నికలు రెండు విడతల్లో జరగునున్నాయి. ఈ నెల 7, 17 వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మరో ఐదు రోజుల్లో ఛత్తీస్‌ఘడ్‌లోని ఇరవై స్థానాల్లో తొలివిడత పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే, పోలింగ్ మరో ఐదురోజులే ఉన్నా ఇప్పటివరకూ ఇక్కడ అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఇంతవరకూ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఏ పార్టీ ఎన్నికల మేనిఫేస్టో ప్రకటించకపోయినా ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంకగాంధీలు ఉచిత హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో అధికార పార్టీతో పోలిస్తే ప్రతిపక్ష పార్టీ కాస్త వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది.
ఉచిత హామీల వర్షం కురిపిస్తున్నారు : ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీల వర్షం కురిపిస్తుంది. తాము తిరిగి అధికారంలోకి వస్తే కులగణన, వరిసేకరణ ధర పెంపు, రైతు రుణమాఫీ, గ్యాస్ సిలిండర్ ధర తగ్గించనున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇంటింటీకి వెళ్లి మరీ ఇలాంటి ఉచిత హామీలను ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకగాంధీలు వీలైనంత ఎక్కువగా ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రచారాల్లో ముఖ్యంగా రైతుల సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారాలకు హామీలను కూడా ఇస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలతో ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ అయినా కాంగ్రెస్‌కే అనుకూల వాతావరణం కనిపిస్తోందని స్వయంగా బిజెపి నేతలే అంగీకరించడం విశేషం.

కులగణనతో.. హిందూ ఓటర్లలో చీలిక : ఛత్తీస్‌ఘడ్‌లో ఇప్పటివరకు హిందువులు, బిసిలు బిజెపికి ఓటుబ్యాంకుగా ఉన్నారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బీసి ఓటర్లను ఆకట్టుకునేందుక కులగణన అనే హామీ ఇచ్చింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో బిసి జనాభా 41 శాతం ఉంది. ఈ కులగణన అనే హామీ హిందూ ఓటర్లలో చీలిక తెస్తుందేమోనని బిజిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ రాష్ట్రంలో బిజెపి నేతలు ప్రచారంలో కాస్త వెనుకబడినట్లే అనిపిస్తోంది. ఏ హామీలు ఇవ్వాలి, ఎలా ప్రచారం చేయాలి అని వారిలో వారే చర్చించుకుంటున్నారు. బస్తర్ డివిజన్‌లో ఈ నెల 7 న ఇక్కడ పోలింగ్ జరగనుంది. బిజెపి నేతల తరుపున ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఇక్కడ బరిలో ఉన్నారు. అయినా ఇక్కడి ప్రచారంలో వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అధికార పార్టీకి మరింత అవకాశంగా మారనుందని విశ్లేషకుల అంచనా..












Click it and Unblock the Notifications