
ఆరోగ్య కేంద్రంలో ఘోరం: నర్సును కట్టేసి, నలుగురు గ్యాంగ్‌రేప్, రికార్డు చేసి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్సుపై నలుగురు దుండగులు ప్రవేశించి.. ఆమె చేతులు కట్టేసి, నోరు బిగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్ కూడా ఉండటం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహేంద్రగఢ్ జిల్లాలోని చిప్చిపి గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో బాధితురాలు నర్సుగా పనిచేస్తోంది. ఆమె ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించిన నలుగురు దుండులు ఆమె చేతులు కట్టేసి.. అరుపులు చేయకుండా గట్టిగా నోరు బిగించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతేగాక, తనపై లైంగిక దాడిని రికార్డు చేశారని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపింది. తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పిన అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అత్యాచార ఘటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ వారికి ఎదురుదాడికి దిగింది. నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. మరోవైపు, ఈ దారుణ ఘటనతో మారుమూల గ్రామాల్లో పనిచేసేందుకు ఆరోగ్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన రక్షణ కల్పిస్తేనే తాము తమ విధులు నిర్వహించగలుగుతామని అంటున్నారు.