కరోనా సెకండ్ వేవ్: రాయ్‌పూర్‌లో ఏప్రిల్ 9 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్
రాయ్‌పూర్: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడి కోసం ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు ఆంక్షలు అమలు చేస్తున్న ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో 10 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 9 నుంచి 19వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క రాయ్‌పూర్ నగరంలోనే 13,107 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రం కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటం పట్ల సీఎం భూపేశ్ బఘెల్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలను అందుబాటులో ఉంచాలని, కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనవసరంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.
దేశంలో గత కొద్ది రోజులుగా భారీగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో అత్యధికంగా 55వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 9,921 కేసులు, 53 మరణాలు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దుర్గ్, రాయ్‌పూర్, రాజ్ నంద్ గావ్, బిలాస్ పూర్, మమాసముంండ్‌లలో భారీగా కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,86,269 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,29,408 మంది కోలుకున్నారు. 4416 మరణించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 52,445 యాక్టివ్ కేసులున్నాయి. గత ఆరు రోజులుగా ప్రతి రోజూ రాయ్‌పూర్ జిల్లాలో 10వేల కేసులు నమోదవుతుండటం గమనార్హం.