టెన్త్ లో స్టేట్ టాపర్ విద్యార్థినికి బ్లడ్ క్యాన్సర్.. చావుతో పోరాడుతూనే..
చాలామంది విద్యార్థులు బాగా చదివి పరీక్షల్లో టాపర్స్ గా నిలుస్తారు. అలా చదివే పిల్లలకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ విద్యార్థిని మాత్రం చావుతో పోరాడుతూనే అద్భుతం చేసింది. ప్రాణాంతక బ్లడ్‌క్యాన్సర్ తో బాధపడుతూనే టెన్త్ పరీక్షల్లో స్టేట్ టాపర్ గా నిలిచింది. లక్ష్యాన్ని ఎప్పుడూ వదులుకోవద్దని యువతకు స్ఫూర్తినిస్తోంది.
ఛత్తీస్ ఘడ్ కు చెందిన విద్యార్థిని ఇషికా బాలా.. అద్భుతం చేసింది. ఓ వైపు బ్లడ్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూనే మరోవైపు రాష్ట్రంలోనే టాపర్ గా నిలిచింది. దీంతో ఆమె జీవితం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఛత్తీస్ ఘడ్ కాంకర్ జిల్లా, గుండాహుర్ గ్రామానికి చెందిన ఇషికా బాలా పేరు ఇప్పుడు మారుమోగుతోంది. కారణం ఆమె ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో టాపర్ గా నిలిచింది. ఇటీవల వెల్లడించిన టెన్త్ ఫలితాల్లో 99.17 శాతం మార్కులతో ఇషికా.. స్టేట్ టాపర్ గా నిలిచింది.

అయితే ఇషికాకు ఈ విజయం మామూలు కాదు.. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ బారిన పడి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడింది. అనారోగ్యం కారణంగా గతేడాది టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. అయినా ఏమాత్రం తన లక్ష్యాన్ని విడువలేదు ఇషికా. దృఢ సంకల్పంతో ఈ ఏడాది పరీక్షల్లో స్టేట్ టాపర్ గా నిలిచి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఇషికాకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు 2023లో వెల్లడైంది. రాయ్ పుర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఇప్పుడు ఆమెకు క్యాన్సర్ తగ్గినట్లు తెలుస్తోంది. కానీ రెగ్యూలర్ చెకప్ అవసరమని వైద్యులు తెలిపారు. ఇదే విషయంపై ఇషికా స్పందించింది. 'నేను చదువు ఆపేస్తానేమోనని అనుకున్నా. కానీ ఎప్పుడూ లక్ష్యాన్ని వీడొద్దు. నాకు ఐఏఎస్ సాధించాలని ఉంది' అని తెలిపింది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి తమ కుమార్తెను ఆదుకోవాలని ఇషిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications