రాత్రి 8 గంటల వరకు కాలేజీలు ఓపెన్- సంస్కరణలు
ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి స్వయానా ముఖ్యమంత్రి చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో ఆయన సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో రాత్రి 8 గంటల వరకు తరగతులు నిర్వహించే కార్యాచరణ ప్రణాళికను పరిశీలించాలని సూచించారు. సాధారణంగా మధ్యాహ్నం రెండు గంటలకే క్యాంపస్‌లు బోసిపోతున్నాయని, సుదీర్ఘ సమయం పాటు తరగతులు అందుబాటులో ఉంచడం ద్వారా విద్యార్థులకు గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాటలీపుత్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఏఎన్ కాలేజీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ మొదటి ఉప ముఖ్యమంత్రి అనుగ్రహ నారాయణ్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రత్న అమృత్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు తరగతులు నిర్వహించాలనే ప్రతిపాదన మాటలకే పరిమితం కాదని, ఇందుకు తగినట్లుగా మౌలిక వసతులను కల్పిస్తామని ప్రకటించారు.

బిహార్‌లోని 13 కోట్ల జనాభా అవసరాలకు ప్రస్తుతం ఉన్న విద్యా మౌలిక సదుపాయాలు ఏమాత్రం సరిపోవని ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 200 కళాశాలలతో పాటు పబ్లిక్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలను స్థాపించబోతున్నట్లు వెల్లడించారు. నూతన వర్సిటీల ఏర్పాటు ప్రక్రియలో స్థల కొరతను అడ్డంకిగా మార్చుకోవద్దని, భూముల కేటాయింపు, కేబినెట్ ఆమోదాలను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సీఎం చెప్పారు.
జూలై నుంచే ఈ కొత్త విద్యా సంస్కరణల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపిస్తాయని సామ్రాట్ చౌదరి వెల్లడించారు. రాష్ట్ర ప్రజల విద్యా అవసరాలను బిహార్‌లోనే తీర్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ నూతన విధానం ద్వారా రాబోయే కొద్ది కాలంలోనే రాష్ట్రంలోని ఉన్నత విద్యా రంగ రూపురేఖలు మారిపోతాయని, విద్యార్థులందరికీ స్థానికంగానే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మెరుగైన ఉన్నత చదువుల కోసం బిహార్‌కు చెందిన విద్యార్థులు పంజాబ్, మహారాష్ట్ర వంటి సుదూర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులను దూరం చేసి, స్వరాష్ట్రంలోనే నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. విభజన అనంతరం 87 శాతం రాబడిని కోల్పోయిన సమయంలో బిహార్ వార్షిక బడ్జెట్ రూ. 6,000 కోట్లేనని గుర్తుచేశారు. నిరంతర సంస్కరణల ద్వారా నేడు రాష్ట్ర బడ్జెట్ రికార్డు స్థాయిలో రూ. 3.17 లక్షల కోట్లకు పెరిగిందని సీఎం వివరించారు.












Click it and Unblock the Notifications