
చైనా కుట్రలు: ఎల్ఏసీకి సమీపంలో కాంక్రీట్ శాశ్వత శిబిరాల నిర్మాణం
న్యూఢిల్లీ/లడఖ్: ఓ వైపు శాంతి మంత్రం చెబుతూనే మరోవైపు ఉద్రిక్తలకు తెరలేపుతోంది జిత్తులమారి చైనా. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామంటూనే.. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో భారీగా శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. వాదాస్పద ప్రాంతాలకు అత్యంత త్వరగా బలగాలను చేర్చేందుకు వీలుగా సరిహద్దుల్లో కాంక్రీట్ శిబిరాలను నిర్మిస్తోంది.
ఈశాన్య లడఖ్-ఉత్తర సిక్కిం నకులా ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా తమ భూభాగంలో ఈ కాంక్రీట్ నిర్మాణాలను చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నకులా సెక్టార్‌లో గత సంవత్సరం భారత్-చైనా బలగాలు ఘర్షణ పడిన ప్రాంతానికి ఈ నిర్మాణాలు కొద్ది దూరంలోనే ఉండటం గమనార్హం. తూర్పు లడఖ్, అరుణాచల్ సెక్టార్ల సమీపంలో కూడా ఇలాంటి నిర్మాణాలను డ్రాగన్ దేశం చేపట్టినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తూర్పు లడఖ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో చలికాలంలో వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో చైనా తమ బలగాల్లో 90 శాతం మందిని విడతల వారీగా మార్చాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే బలగాల ఇక్కడే నివాసం ఉండేందుకు చైనా ఈ నిర్మాణాలను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ శాశ్వత నిర్మాణాలు పూర్తయితే, పెద్ద ఎత్తున బలగాలను ఇక్కడ మోహరించుకునే ప్రయత్నాలు చేస్తోంది చైనా.
Recommended Video
మరోవైపు సరిహద్దు ప్రాంతం వరకు కూడా రవాణా మార్గాలను మెరుగుపర్చుకుంటోంది. ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు తలెత్తితే వేగంగా తమ సైన్యాన్ని తరలించేందు కోసం ఈ కుయుక్తులకు తెరలేపుతోంది చైనా. గల్వాన్ లోయలో ఘర్షణ నాటి నుంచి సరిహద్దులో వాతావరణం కాస్త ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. బలగాలను మోహరించేందుకు తాము సిద్ధమేనని ప్రకటిస్తూనే.. భారీ ఎత్తున సైన్యాన్ని సరిద్దులకు తరలించేందుకు చైనా చేస్తున్న కుట్రలను భారత సైన్యం గమనిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు చైనా కవ్వింపు చర్యలకు ధీటుగా జవాబిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి భారత బలగాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఈశాన్య లడఖ్ సరిహద్దు వెంబడి సుమారు 50వేలకుపై భారత సైనికులు పహారా కాస్తున్నట్లు సమాచారం.