చైనాను మంటెక్కించిన అమిత్ షా: ఆ పర్యటన పట్ల అభ్యంతరం
న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించ తలపెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన కాక రేపుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగు పెట్టనున్నారు. ఈ సాయంత్రం ఆయన ఇటానగర్‌కు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు అమిత్ షా. అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
కిబితూలో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. దీనితో పాటు గోల్డెన్ జూబ్లీ బోర్డర్ ఇల్యుమినేషన్ ప్రోగ్రామ్‌ను లాంఛనంగా ప్రారంభిస్తారు. తొమ్మిది సూక్ష్మస్థాయి జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. భారత్- చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటుంది ఈ కిబితూ గ్రామం. అక్కడ పర్యటించనున్నారాయన.
కొద్దిరోజుల కిందటే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న 11 గ్రామాలు, ఇతర ప్రాంతాల పేర్లను చైనా మార్చివేసింది. ఝంగ్‌నన్ రీజియన్‌గా పేరు పెట్టింది. ఈ రీజియన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల ప్రాంతాలన్నీ తమ దేశ భూభాగానికి చెందినవేనంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. ఈ ప్రాంతంపై భారత పెత్తనం తగదని, ఇది పూర్తిగా తమదేశ భూభాగమేనని అన్నారు.

వెన్‌బిన్ ప్రకటన తరువాత భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆయన ప్రకటనలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతి అంగుళం కూడా భారత్‌కు చెందినదేనని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తలపెట్టడం చర్చనీయాంశమౌతోంది. ఆయన పర్యటన పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
అమిత్ షా పర్యటన తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేదని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనల ఉల్లంఘనకు అమిత్ షా పాల్పడుతున్నట్లు పేర్కొంది. అమిత్ షా పర్యటనను తాము ఏ మాత్రం సమర్థించట్లేదని, ఇది భారత్ అంతర్గత వ్యవహారంగా తాము భావించట్లేదని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. చైనా అభ్యంతరాలను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications