వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా: దేశభక్తితో పశ్చిమ దేశాలపై విరుచుకుపడుతున్న ఈ 'జిగాన్వు' బ్లాగర్లు ఎవరు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

చిరునవ్వులు చిందించే ఫోటోలతో చైనీస్ బ్లాగర్ గయన్ముచన్ వీబోలో స్నేహపూర్వకమైన వ్యక్తిలా కనిపిస్తారు.

china

చైనాలో ట్విటర్ లాంటి ఆన్‌లైన్ వేదిక వీబోలో ఆమెకు 64 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కరెంట్ అఫైర్స్‌లో వాడివేడి అంశాలను తనదైన శైలిలో ఆమె వీడియోలుగా చిత్రించి పోస్టు చేస్తారు.

కానీ, కవర్ పేజీలో మాత్రం చెట్ల మధ్య ఫోటోకు పోజిస్తున్న అందమైన అమ్మాయి చిత్రం కనిపిస్తుంటుంది. దీని మాటున ఆమె తను చెప్పాలనుకునే కథలను చెప్పేస్తుంటారు.

ఇటీవల చేసిన ఓ పోస్టులో యూరోపియన్ యూనియన్.. అమెరికా చెప్పినట్లు నడుచుకుంటోందని ఆమె వ్యాఖ్యానించారు. ''అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధానికి నిదర్శనం. అమెరికన్లు ప్రస్తుతం ఒకరినొకరు చంపుకొంటున్నారు" అని మరో పోస్టులో చెప్పుకొచ్చారు.

"జిగాన్వు" బ్లాగర్లలో గయన్ముచన్ ఒకరు. చైనా సోషల్ మీడియాలో ఈ బ్లాగర్లకు చైనా జాతీయవాదానికి మధ్య బలమైన సంబంధం ఉంది.

వీరికి "వుమావో" ట్రోల్ ఆర్మీతో పోలిక ఉంది. వుమావో సైన్యం డబ్బు తీసుకుని జాతీయవాదాన్ని ప్రచారం చేస్తుంది. కానీ "జిగాన్వు" అదే పనిని ఉచితంగా చేస్తుంది.

"జిగాన్వు"లో వేలాది మంది బ్లాగర్లు చేసే ఘాటైన పోస్టులు, వీడియోల్లో తరచుగా పాశ్చాత్య దేశాలను, వారి మీడియా సంస్థలను విమర్శిస్తుంటారు. పాశ్చాత్య ప్రభావంతో అవతరించిన స్త్రీవాదం, మానవ హక్కులు, అక్కడి సంస్క్కృతీ సంప్రదాయాలు, ప్రజాస్వామ్యం లాంటివి చైనా సమజాన్ని "భ్రష్టుపట్టించే"లా ఉన్నాయని వారు ఆరోపిస్తుంటారు.

తైవాన్, హాంకాంగ్‌లలో ప్రజాస్వామ్య అనుకూల ప్రచారాలు చేసే కార్యకర్తలు, మేధావులు, నిపుణులు అందరూ "వేర్పాటువాదం"ను ప్రోత్సహిస్తున్న వారేనంటూ ఈ సోషల్ మీడియా ఆర్మీ ధ్వజమెత్తుతుంటుంది.

ఈ ఆర్మీ లక్ష్యంగా చేసుకున్న వారిలో రచయిత ఫాంగ్ ఫాంగ్ ఉన్నారు. వుహాన్‌లో కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తొలి నాళ్లలో వైరస్ వ్యాప్తి గురించి చెప్పి, ప్రపంచ దృష్టిని ఆమె ఆకర్షించారు. అయితే, "జిగాన్వు" బ్లాగర్ షాంగ్‌డిజియింగ్.. ఫాంగ్ ఫాంగ్‌ను ఉద్దేశించి చేసిన పోస్ట్‌ గత ఏడాది వైరల్‌ అయింది. "ఈమె మాకు వెన్నుపోటు పొడిచారు. చైనా వ్యతిరేక శక్తులు మమ్మల్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్న అతి పెద్ద ఆయుధాలలో ఈమె ఒకరు"అని ఆరోపించారు.

ఇటీవల, ప్రముఖ వైద్య నిపుణులు జాంగ్ వెన్‌హాంగ్.. కోవిడ్‌తో చైనా సహజీవనం చేయాల్సి ఉంటుందని చెప్పడంతో, అధికారిక పాలసీకి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆయన్ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.

చాలా మంది బ్లాగర్లు వెంటనే పాత వ్యాఖ్యానాలను వెలికితీసి, ఆయన గ్రంథచౌర్యానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. పిల్లలు అల్పాహారంలో భాగంగా పాలు తాగాలనే ఆయన సూచన.. చైనా సాంప్రదాయ అల్పాహార నియమాలను తిరస్కరించినట్లుగా పరిగణించారు. "ఇది పాశ్చాత్య దేశాలను ఎక్కువగా ఆరాధించడం, విదేశీయులను చూసి భయపడటం కాదా?" అని పింగ్మిన్ వాంగ్జియాషి అనే బ్లాగర్‌ రాసుకొచ్చారు.

ఇలాంటి పోస్టులు ప్రతి రోజూ డజన్ల కొద్దీ బయటకు వస్తాయి. ''ఇవి తరచూ ప్రజల మనోభావాలను, భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకోవడంతో వేగంగా వైరల్ అవుతున్నాయి''అని నిపుణులు అంటున్నారు.

"ఇది ఫాస్ట్‌ఫుడ్ జాతీయవాదం" అని చైనీస్ సోషల్ మీడియా విశ్లేషకులు మన్య కోట్సే చెప్పారు. "ప్రజలు వాటిని చూస్తారు. మిగతావారితో పంచుకుంటారు. ఆపై మర్చిపోతారు"అని అన్నారు.

అది సగం కథ మాత్రమే

చైనా, పాశ్చాత్య దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ఫలితంగా చైనాలో జాతీయవాదం పెరుగుతోందని చాలా మంది అంటున్నారు. కానీ అది సగం కథ మాత్రమే.

ప్రపంచంలో చాలా చోట్ల జాతీయవాదం పెరుగుతోంది. అయితే, చైనాలో మాత్రం వేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియా, దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గట్టి మద్దతు ఇస్తున్న ''ప్రత్యేక చైనా ముద్ర'' దీనికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.

"జిగాన్వు" బ్లాగర్లలో "చాలా మంది యువకులు ఉన్నారు. వీరు చైనా గొప్పదనాన్ని, దేశభక్తిని నరనరాన నింపుకున్నారు. దేశానికి ఎదురైన అవమానాలను, చారిత్రక విషయాలను పూర్తిగా జీర్ణించుకున్నారు" అని కోయెట్సే చెప్పారు. "కాబట్టి వీరు చైనా అనుకూల భావాలతో విదేశీ సంస్కృతిని గట్టిగా వ్యతిరేకిస్తుంటారు."

ఆన్‌లైన్ ప్రసంగాలపైనా చైనా కఠిన నిబంధలను అమలు చేస్తోంది. అసాధారణ సెన్సార్‌షిప్ ఉన్నా, వీరి ప్రాముఖ్యత పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీబో, వీచాట్ లాంటి సోషల్ మీడియా వేదికలపై తరచుగా "సున్నితమైన" పోస్టులను క్రమం తప్పకుండా తొలగిస్తుంటారు.

అయితే, చైనా ప్రభుత్వ నిర్ణయాలను ప్రోత్సహించేవారిని స్వేచ్ఛగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నారని పరిశీలకులకు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్‌ను ముద్రించడం లేదా రీ పోస్టులు చేయడం కూడా చేస్తున్నారు.

"జిగాన్వు"కి ప్రభుత్వంతో నేరుగా సంబంధాలున్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ జిగాన్వుకి చెందిన కొంత మంది బ్లాగర్లకు ప్రాంతీయ ప్రభుత్వ విభాగాల నుంచి ప్రత్యేక కార్యక్రమాలకు అతిథులుగా ఆహ్వానాలు అందుతున్నాయి. మరికొందరికి గౌరవ బిరుదులు కూడా ఇచ్చి సత్కరిస్తున్నారు.

గుయాన్ముచన్, అసలు పేరు షు చాంగ్. 2014 లో "మీరు ఒక చైనీస్ వ్యక్తి" అనే వ్యాసంతో మొదటిసారిగా ఆమె తనదైన ముద్రను వేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె యాంటై నగర ప్రభుత్వం నిర్వహిస్తున్న బ్లాగర్ల కార్యక్రమంలో కనిపిస్తున్నారు. ప్రభుత్వ వార్తా సంస్థ యూత్.సిఎన్ నిర్వహించిన కార్యక్రమంలోనూ ఆమె ఉపన్యసించారు. జులైలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ నుంచి "ఇంటర్నెట్ అంబాసిడర్"గా గుర్తింపు పొందిన అనేక మంది బ్లాగర్లలో షు చాంగ్ కూడా ఒకరు.

ఈ అంశంపై బీబీసీ ఆమెను సంప్రదించగా, ఆమె స్పందించలేదు.

సహజీవన సంబంధం

"జిగాన్వు"అనేది ఇక్కడి సంక్లిష్ట వ్యవస్థల్లో ఒక భాగం మాత్రమే.

షిన్‌జియాంగ్‌లో పత్తి సాగుకు సంబంధించిన ఆందోళనల సమయంలో చైనా సోషల్ మీడియాలో, ప్రత్యేకించి వీబోలో దేశభక్తి గురించి ప్రభుత్వ మీడియా సంస్థలు ఒకే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేయడం పెద్ద చర్చలకు దారితీశాయి.

డిజిటల్ ఆర్టులు వేసేవారు, చిన్న మీడియా కంపెనీలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విదేశీయుల వ్లాగర్‌లతో సహా అనేక చిన్న బ్లాగర్ల బృందాలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి.

చైనా ఇంటర్నెట్ నిబంధనలు పార్టీ ప్రచారాన్ని చురుకుగా ప్రోత్సహించడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఈ బ్లాగర్ల వ్యవస్థలను వాడుకుంటూ దోపిడీ చేస్తున్నాయని థింక్-ట్యాంక్ డబుల్ థింక్ ల్యాబ్‌ విశ్లేషకులు హర్‌ప్రె కే పేర్కొన్నారు.

"మీరు అవకాశవాది కావచ్చు. కెరీర్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉండాలనుకుంటే, ఈ విషపూరిత జాతీయవాద వాతావరణంలో నేను ఎలా ఫేమస్ అవుతాను" అని ఆయన అన్నారు.

వారికి నేరుగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగనప్పటికీ, ఈ బ్లాగర్లకు జాతీయ మీడియాలో చోటు ఇవ్వడం ద్వారా, వారికి వ్యక్తిగత గుర్తింపు లభించి, మరింత ప్రయోజనం పొందుతారని విశ్లేషకులు అంటున్నారు.

పెరిగిన రీడర్‌షిప్‌తో, వారు ప్రకటనలు లేదా పెయిడ్‌ కంటెంట్ ద్వారా భారీగా సంపాదించవచ్చు. పది లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఖాతా ద్వారా సంవత్సరానికి కొన్ని వేల డాలర్లు ఆర్జించే వారికి సమానంగా సంపాదించే అవకాశం ఉందని జర్నలిజం, కమ్యూనికేషన్స్ విద్యావేత్త డాక్టర్ ఫాంగ్ కెచెంగ్ అంచనా వేశారు.

ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు, చర్చలు చేసేలా "జిగాన్వు" ప్రోత్సహించడం ద్వారా, "ప్రభుత్వం తన భావజాల వ్యాప్తిని పూర్తి చేస్తుంది. ఈ బ్లాగర్లకు గుర్తింపు లభిస్తుంది. ఈ ప్రచారానికి రోల్ మోడల్స్‌గా కూడా మారతారు" అని ఫాంగ్ కెచెంగ్ చెప్పారు.

వీబో, వీచాట్ వంటి సోషల్ మీడియా వేదికలు కమ్యూనిస్ట్ పార్టీకి విధేయతను చూపే పోస్టులను ప్రోత్సహించడంలో ఓ కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ ఫాంగ్ కెచెంగ్ చెప్పారు. ఫలితంగా అవి వాణిజ్యపరంగా ప్రయోజనం పొందుతాయి. "ఇది వినియోగదారులను, వారి కార్యకలాపాలను పెంచుతుంది. కనుక ఇది వారికి చాలా మంచి వ్యూహం" అని ఆయన వివరించారు.

కానీ బ్లాగర్లు స్పష్టమైన పరిధి మేరకు తమ విధిని నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో వారు అత్యుత్సాహానికిలోనై గీతదాటి చాలా దూరం వెళ్లిపోతారు.

ఇటీవల కాలంలో, అమెరికా ప్రయోగశాల నుంచి కరోనావైరస్ లీక్ అయ్యిందని జిగాన్వులో పోస్టులు దర్శనమిచ్చాయి. రాడికల్ కమ్యూనిస్ట్ సంస్కరణలకు పిలుపునిచ్చిన ఓ ఉద్వేగభరితమైన వ్యాసం వైరల్ అయింది. ప్రభుత్వ మీడియా సైతం దానికి ప్రాచుర్యం కల్పించింది. కానీ ఆన్‌లైన్‌లో దీనిపై వివాదం చెలరేగిన తర్వాత ఈ వ్యాసాన్ని కొద్దిగా సెన్సార్ చేశారు.

"కొన్నిసార్లు మీరు ఏం చెప్పాలో లేదా చెప్పకూడదో తెలిపే నియమాలు చాలా గందరగోళంగా ఉంటాయి"అని కోట్సే చెప్పారు. ఈ బ్లాగర్లు చెప్పే అంశం మరుగునపడటానికి ఒక్క వీబో పోస్ట్ మాత్రమే సరిపోతుందని వివరించారు.

"వారి వ్యక్తిగత నమ్మకాలు, ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా ఉన్నంత వరకు వారికి అధికారులు సాయపడొచ్చు. కానీ అవి ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్నప్పుడు వారు ఉనికిని కోల్పోతారు."

కానీ చాలా మంది ఈ గేమ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నారు.

సెప్టెంబర్ చివరలో, గయన్ముచన్‌ను 15 రోజుల పాటు, తన పేజీలో కొత్త కంటెంట్‌ను పోస్టు చేయకుండా వీబో నిరోధించింది. ప్లాట్‌ఫాం "కమ్యూనిటీ మార్గదర్శకాలను ఆమె ఉల్లంఘించారు"అని పేర్కొంది.

ఆమె వెంటనే పాత పోస్టును, వీక్షకులకు చేరేలా ప్రత్యామ్నాయ పేజీని తెరచి ప్రమోట్ చేశారు. అందులో ఆమె ప్రతి రోజూ పరుషమైన పోస్టులను "జిగాన్వు"లో పోస్ట్‌ చేస్తూనే ఉన్నారు.

"ఒకవేళ ఏదైనా జరిగితే" అనే ఉద్దేశంతో, "నేను ఈ చిన్న ఖాతాను ఏర్పాటు చేశాను" అని ఆమె రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
China: Who are these 'Jiganwu' bloggers who are patriotically attacking the West
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X