చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తూరు పశువుల పండుగ, తమిళనాడు జల్లికట్టు ఒకటేనా... ఈ పోటీల ప్రత్యేకత ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చిత్తూరులో జల్లికట్టు వేడుకలు

సంక్రాంతి అంటే మూడురోజుల పాటు జరుపుకునే పండుగ. చిత్తూరు జిల్లాలో మాత్రం జనవరి మాసమంతా పశువులతో పండగే.

జల్లికట్టు పేరు చెప్పగానే మెదట గుర్తుకు వచ్చేది తమిళనాడు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో జల్లికట్టు తరహాలో, అంతకు మించిన ఉత్సాహంతో పశువుల పండుగ జరుగుతుంది.

రంకెలేస్తూ పరుగుతీసే కోడెగిత్తలను పట్టుకోవడానికి యువత ఉత్సాహం చూపుతుంది. దీన్ని చూసేందుకు ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచీ వస్తారు..

చిత్తూరు జిల్లా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఆ రాష్ట్రాల సంస్కృతి ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.

తమిళనాడులో కనుమరోజు జల్లికట్టును జరుపుకుంటే ఇక్కడమాత్రం సంక్రాంతికి ముందు నుంచే జల్లికట్టు తరహా క్రీడను జరుపుకుంటారు. దాని పేరు మాత్రం పశువుల పండుగ. అదే కర్ణాటకలో మైలార్ పండుగ అని, 'సంక్రాంతి హబ్బా' అని పిలుస్తారు.

ప్రాంతం ఏదైనా సంక్రాంతి పండుగ అంటే మాత్రం యువత పశువులతో కుస్తీనే. కొన్ని చోట్ల ఇది హింసాత్మకంగా ఉంటుంది. దీంతో పోలీసులు ఆంక్షలు విదిస్తారు. కేసులు పెడతారు. అయినా ప్రాణాలను పణంగా పెట్టి ఈ పండుగను జరుపుకుంటారు.

చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండుగ

ఈ పండుగ ఎలా మొదలైంది?

సంక్రాంతి రోజున పూర్వీకులు ఇష్టదేవతల్ని పూజించేవారట. కనుమ పండగ రోజు పశువులకు పూజలు చేసేవారు. "జల్లికట్టు అనేది తమిళ సంప్రదాయం.

చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఉండడంతో ఆ సంప్రదాయాలు ఎక్కువగా ఉంటాయి. కనుమ పండుగ రోజు కాటమరాజుకు పూజిస్తారు.

'కాడు' అంటే తమిళంలో 'అడవి' అని అర్థం. అడవి రాజును తమిళంలో 'కాట్టురాజా' అని పిలిచేవారు. రాను రాను ఆ పదం తెలుగులో కాటమరాజుగా రూపాంతరం చెందింది.

గతంలో అడవి నుంచి వచ్చే పశువులకు కొండ దగ్గర కాటమరాజుకు పొంగళ్లు పెట్టి, అక్కడ పెద్ద మంట వేసి ఆ మంట చుట్టూ పశువులను తిప్పి ఇంటికి తీసుకొచ్చేవారు.

అయితే కాలక్రమేణా ఇది ఒక వినోద క్రీడగా మారిపోయింది. అందులో నుంచి పుట్టిందే జల్లికట్టు, పశువుల పండుగ, పసల పండుగ. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు''అని సీనియర్ జర్నలిస్ట్ ఎ.రామచంద్రారెడ్డి బీబీసీతో చెప్పారు.

తమిళనాడులో జల్లికట్టు

ఈ పండగ అంటే యువకుల్లో ఎక్కడలేని ఉత్సాహం

సంక్రాంతి పండుగ అంటే కోస్తా జిల్లాల్లో కోడిపందాలు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, చిత్తూరు జిల్లాలో పశువుల పండుగకు కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తారు.

ఆంధ్రా జ‌ల్లిక‌ట్టుగా పిలిచే ఈ పశువుల పోటీల్లో పాల్గోనేందుకు ముఖ్యంగా యువ‌కులు పోటీపడతారు. బ‌ల‌మైన ఎద్దుల్ని అదిమిప‌ట్టి నిలువ‌రించేందుకు వారు చూపించే తెగువ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది.

''ఎద్దులను ధైర్యం చేసి పట్టుకుంటాము. దానికి కట్టిన బహుమతిని తీసుకుంటాము. ఎద్దు కొమ్ములకు కట్టిన బహుమతి దేవుడిది. కాబట్టి, దాన్ని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో సాహసం చేస్తాం. ఈ పండుగ కోసం సంవత్సరమంతా వెయిట్ చేస్తాం. గాయాలు కాకుండా జాగ్రత్త పడతాము. ఒకవేళ అయినా ఎద్దును పట్టిన ఆనందంలో అవేవీ పట్టించుకోము’’ 'అని నెమలిగుంటపల్లికి చెందిన రమేశ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

''చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా దీని పేరు 'పశువుల పండుగ’. ఇప్పుడు జల్లికట్టుగా మార్చారు. పశువుల పండగ చాలాకాలం నుంచి ఉంది. నూతిగుంట పల్లికి వచ్చి మేముంతా ఉత్సాహంగా పాల్గొని, దీంట్లో ఘనంగా రెండు పలకలు పట్టాము. ఇంకా చాలా ఊళ్లలో జరుగుతాయి. అన్నిటిలో ఇష్టంగా పాల్గొంటాము. చాలా ఎంజాయ్ చేస్తాము. మాకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం’’ అని అరిగివారి పల్లెకు చెందిన దినేశ్ యాదవ్ బీబీసీతో చెప్పారు.

చూపరులను ఆకట్టుకుంటుంది

ఈ ఎద్దుల‌ను ప‌ట్టుకోవడంలో యువ‌త చూపించే ఉత్సాహం చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

"ఇక్కడ సంక్రాంతి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలలో జల్లికట్టును ఉత్సాహంగా జరుపుతారు. ముఖ్యంగా యూత్ చాలా పెద్ద పండగలాగా జరుపుకుంటారు. వాళ్లు పలకను పట్టుకుంటే పెద్దగ్రేట్‌ గా ఫీలవుతారు.అలాగే యూత్, మహిళలు, పెద్దలు, చిన్నపిల్లలు చూడడానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ నూతిగుంట పల్లిలో ఇరవై అయిదు ఏండ్ల నుంచి జరగడం లేదంట. మళ్లీ జరగడం ఇప్పుడే. కాబట్టి ఇంకా ఎక్కువ మంది జనాలు వచ్చారు’’ అని ఈ పశువుల పండుగను చూడడానికి వచ్చిన తిరుపతికి చెందిన ప్రవీణా అనే యువతి తన ఆనందాన్ని బీబీసీతో పంచుకున్నారు.

అళ్లి అంటే ఏంటి.?

ఎక్కడైతే పశువుల పండుగ జరపాలి అనుకుంటారో ఆ వీధుల్ని మట్టితో చదును చేసుకుంటారు. పశువులు బయటకు పోకుండా ఆ వీధికి రెండు వైపులా అడ్డంగా కర్రల్ని, వెదురు తడికల్ని కట్టి ప్రత్యేకంగా అళ్లిని ఏర్పాటు చేస్తారు. ఆ అళ్లిలోకి విడివిడిగా లేదా గుంపులు గుంపులుగా పశువుల్ని వదులుతారు.

''పశువుల పండగ అంటేనే ఆవుల్నీ, ఎద్దుల్నీ తరిమే పండగ. మా ఊర్లో యూత్ కి ఆవుల్ని తరిమేది ఎద్దుల్ని తరిమేది అంటే ఎంజాయ్‌మెంట్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు జరుపుతారు. ఎట్టా

తరముతారంటే, అవి పరిగెత్తేది చూస్తుంటే చాలా అనందంగా ఉంటుంది’’ అని బొప్పరాజు పల్లికి చెందిన మునీశ్వరి బీబీసీతో అన్నారు.

సినిమా నటుల ఫొటోలు పెట్టి పండుగ పోటీల్లో పాల్గొంటారు

సినీ యాక్టర్ల ఫొటోల సందడి..

అళ్లిలో పరుగులు తీసే పశువుల కొమ్ములకు పూజించే దేవతల ఫొటోలు, తాము అభిమానించే సినీ హీరో, హీరోయిన్ ల ఫొటోలు కట్టి తరుముతారు

''మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. పలకలు ఆవుల కొమ్ములకు కట్టి వదులుతారు. అందులో రకరకాల టవల్స్, వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ ఫొటోలను కడతారు. తమన్నా, ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ సీనియర్ ఎన్టీయార్...ఇలా చాలామంది ఫొటోలను కడతారు. ఎన్ని గొడవలైనా ఇవి చేస్తానే ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా చాలా హ్యాపీగా ఫీలవుతారు’’ అని నెమలిగుంట పల్లెకు చెందిన స్వరూప బీబీసీతో చెప్పారు.

ఇది జల్లికట్టా..! పశువుల పండుగా..!

''ఇది పశువుల పండుగ. జల్లికట్టు అనేది లక్షల్లో పందాలు కాస్తారు. ఇక్కడ అదేమీ ఉండదు. జనాల మధ్య పశువులు పోతుంటే ఆనందపడతారు. ఇది నా ఆవు, నా పశువు అని చూపించుకోవడానికి జరిపే పశువుల పండుగ. జనాల మధ్య పోతుంటే ఇది నాది అని చెప్పుకొని రైతు గర్వంగా ఫీల్ అవ్వడానికి మాత్రమే జరిపే పండుగ. ఇక్కడ ఎలాంటి బెట్టింగ్‌లు ఉండవు. గ్రామాల ప్రజలు అంతా కలిసికట్టుగా జరుపుకుంటాం. దాదాపు రెండు మూడు మండలాల ప్రజలంతా ఇక్కడికి వచ్చి పశువులను పట్టుకోవడానికి పోటీలు పడతారు. పట్టుకున్నవాడు పెద్ద హీరోగా ఫీల్ అవుతారు. తమిళనాడు తరహాలో మేము ప్రిపేర్ చేయడం అంటూ ఏమీ ఉండదు’’ అని నూతిగుంట పల్లి చెందిన చంద్రశేఖర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఈ ఒక్కరోజు కోసం పశువులను పెంచే రైతులు కూడా ఉన్నారు.

''ఈ పండగ కోసమని మేము ఓ ఎద్దును పెంచుతున్నాము. పుట్టిన దగ్గరనుంచీ మా దగ్గరే పెరిగింది. ఎక్కడైనా పశువుల పండుగ జరుగుతుంటే తీసుకెళ్లి అళ్లిలో వదులుతాము. మిగిలిన టైంలో మా పొలాల్లో మేపుకుంటాము. టైంకి మేత పెట్టి నీళ్లు పెట్టి దానికి కావాల్సిన దాణా అందిస్తున్నాము. సంవత్సరానికి ఒకసారి పశువుల పండగ వస్తుంది కాబట్టి మేం పశువులు తరుంకునే దానికి దీన్ని పెంచుతున్నాము. మా ముత్తాతల కాలం నుంచి చేస్తున్నాము ఈ పండగని’’ అని బొప్పరాజు పల్లికి చెందిన నాగరాజమ్మ బీబీసీకి చెప్పారు.

తమిళనాడులో జల్లికట్టు

జనవరి అంతా పండుగే...

సంక్రాంతి పండుగ‌కు ముందు నుంచే ఈ ప‌శువుల పోటీలు చిత్తూరు జిల్లా న‌లుమూల‌లా ఏదో ఒక ప్రాంతంలో నిత్యం జ‌రుగుతూ ఉంటాయి.

'' జనవరి కాదు మార్చి వరకు కూడా ఈ పండుగ జరుగుతుంది. గతంలో ఈ సంక్రాంతి మూడు రోజులు మాత్రమే జరిగేది. ఇప్పుడు పశువులు ఎక్కువ ఉన్నాయి. రెండు మూడు గ్రామాలు కలిపి ఒక రోజు చేసుకుంటాం. రోజుకొక గ్రామంలో జరుపుతాం. ఈ ఒక్క రోజు పండుగ కోసం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసే యువతంతా వచ్చి వారం పది రోజులు కష్టపడి మొత్తం సిద్ధం చేస్తారు. వాళ్లు ముందుకు వచ్చి చేయడంతోనే ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. సంక్రాంతికి ముందే ఈ పండగ మాకు వచ్చింది’’ అని నూతిగుంట పల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఈ పశువుల పండుగను చూసేందుకు ఇతర రాష్ట్రాలనుంచీ తరలి వస్తారు. "మాది కోలార్.. ఆంధ్రా పండక్కి వచ్చినాం. మా ప్రాంతాల్లో సరిగా చేయరు. ఇక్కడ బాగా పరిగెత్తే ఎద్దులు పట్టేదానికి, చూసేదానికి వస్తాము. ఈ సంక్రాంతి పండగంటే మాకు జాస్తి పిచ్చుంది. ఈ పండగ జరుగుతుందంటే ఎంత దూరమైనా పోతాము. ఎన్ని బాధలు రానీ సంక్రాంతి పండగను వదలము’’ అని కర్ణాటకకు చెందిన ఉమేశ్ బీబీతో చెప్పారు.

ఆంక్షలు

పశువుల పండగలను జరపరాదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. మా ఆచారంలో భాగంగా ఈ ప‌శువుల పండుగను నిర్వహిస్తుంటామ‌ని వారంటున్నారు.

''మా తాతల ముత్తాతల కాలం నుంచి చేస్తున్నారు. వాళ్లు వచ్చి ఆపేయండి అంటున్నారు. మా ఊర్లో గత సంక్రాంతికి కూడా చేయనీలేదు. ఈ తడవ చేస్తారు. మా ఎద్దును పండగకు తోలుతుంటే పోలీసులు వద్దంటున్నారు. అయితే అవన్నీ మేం పట్టించుకోం. వాళ్లకు ఏదో ఒకటి చెప్పేసి మళ్లా తోలుకొని పోతాం''అని బొప్పరాజు పల్లికి చెందిన నాగరాజమ్మ బీబీసీకి చెప్పారు.

''ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల్లో సంక్రాంతి సమయంలో అనుమతి లేకుండా ఆడే ఆట జల్లికట్టు. దీన్ని కొంతమంది పశువుల పండగని, మరికొంతమంది జల్లికట్టని అంటారు. గ్రామాల్లో పశువుల్ని ఉపయోగించి ఈ ఆటలను ఆడతారు. ఇది లీగలైజ్డ్ స్పోర్ట్ కాదు. ఎక్కడైతే జల్లికట్టు జరుగుతుందని మాకు సమాచారం వస్తుందో అక్కడకు వెళ్లి వాటిని ఆపేందుకు ట్రై చేస్తున్నాం’’ అని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు బీబీసీతో అన్నారు.

చాలాచోట్ల కేసులు రిజిస్టర్ చేస్తున్నట్లు అప్పలనాయుడు తెలిపారు. ఇది జంతు హింస చట్టాల పరిధిలోకి వస్తుందని ఆయన తెలిపారు.

''రైతు బాగుండాలి, పశువులు బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఈ పండుగను జరుపుకుంటాం. ఇక్కడ తమిళనాడు తరహాలో బెట్టింగ్ జరగదు. ఏ క్రీడ జరిగేటప్పుడైనా చిన్నచిన్న గాయాలు అవుతాయి. కానీ, ప్రాణనష్టం జరుగుతోందని చెప్పడం తప్పు’’ అని ఎ.రంగంపేటకు చెందిన సుధాకర్ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chittoor Cattle Festival, Tamil Nadu Jallikattu is one and the same
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X