పోలీసులకు సవాలుగా మారిన చర్చి స్ట్రీటు బాంబు పేలుడు కేసు
బెంగళూరు: బెంగళూరులోని ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్ లో జరిగిన బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఇప్పటి వరకు సరైన ఆదారాలు చిక్కలేదు. పోలీసులు సిమి ఉగ్రవాదుల మీద కన్ను వేశారు. కేసు దర్యాప్తు చేస్తన్న ప్రత్యేక బృందం అధికారులు ఇంకోక సారి మద్యప్రదేశ్ వెళ్లి విచారణ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.
మద్యప్రదేశ్ లోని కంద్వా జైలు నుండి ఐదు మంది సిమి ఉగ్రవాదులు తప్పించుకుని పరారైనారు. వారి ప్రమేయంతో బెంగళూరు బాంబు పేలుడు స్పృష్టించి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాంబు పేలుడు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు పారిపోయిన ఐదు మంది సిమి ఉగ్రవాదులను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గత 10 రోజుల క్రితం బెంగళూరు పోలీసులు బీహార్ వెళ్లి అక్కడి పాట్నా జైలులో ఉన్న సిమి ఉగ్రవాదులు హైదర్ ఆలీ, ఊమర్ సిద్దిఖిలను బాడి వారెంట్ మీద బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చేశారు. వీరిద్దరు పాట్నాలో మోది ర్యాలి జరుగుతున్న సమయంలో వరుస బాంబు పేలుళ్లు స్పృష్టించారని అరెస్టు చేశారు. బెంగళూరు బాంబు పేలుళ్లకు వీరికి సంబంధం ఉందని పోలీసు అంటున్నారు.

అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని ఆ ఇద్దరు చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. బాంబు పేలుడు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఊమర్ సిద్దిఖి హైదర్ ఆలీని విచారణ చేసినా పెద్దగా ఫలితం లేదు. సిమి ఉగ్రవాదులు అందరికి బాంబులు తయారు చెయ్యడం,వాటిని ఎలా పేల్చాలి అని శిక్షణ ఇస్తారని ఇద్దరు అంగీకరించారని దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు వివరించారు.
చర్చి స్ట్రీట్ లోని బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి ఊమర్ సిద్దిఖి, హైదర్ ఆలీని పిలుచుకుని వెళ్లి విచారణ చేసి వివరాలు రాబట్టారు. బాంబు పేలుడు స్పృష్టించింది కచ్చితంగా సిమి ఉగ్రవాదులే అని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు.
పాట్నాలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు చేసిన బీహార్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. బెంగళూరు పోలీసులు బీహార్ పోలీసు అధికారులను సంప్రదించి అక్కడ జరిగిన బాంబు పేలుళ్లకు ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించారు అని తెలుసుకున్నారు. బెంగళూరు బాంబు పేలుడుకు, పాట్నా పేలుళ్లకు ఒకే పేలుడు పదార్థాలు ఉపయోగించారని వివరాలు సేకరించారు.
అయితే ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేకపోయారు. 2014 డిసెంబర్ 28వ తేదిన చర్చి స్ట్రీట్ లో బాంబు పేలుడు జరిగింది. చెన్నయ్ కి చెందిన భవాని అనే మహిళ బలి అయ్యింది.












Click it and Unblock the Notifications