సుప్రీం సాక్షిగా కేంద్రంతో డీల్ ఓకే ..! కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..!
నీట్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జూలై 20న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ.. (CJP) ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకుంది. అయితే ఢిల్లీ ఆందోళనల సందర్భంగా విద్యార్దులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను తొలగిస్తామని కేంద్రం ఇచ్చిన హామీ మాత్రం నిలబెట్టుకోలేదు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ఈ నెల 5న ఇండియా గేట్ వద్ద మరో విడత నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
గతంలో విద్యార్దులపై ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను తొలగించే విషయంలో కేంద్రం నిర్లిప్తతను తప్పుబడుతూ సెప్టెంబర్ 5న ఇండియా గేట్ వద్ద సీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో కేంద్రం సుప్రీంకోర్టుకు నిన్న కీలక సూచన చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమకు లభించే విశేషాధికారాల్ని వినియోగించి విద్యార్దులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ ల రద్దుకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పిటిషన్ కూడా దాఖలు చేసింది. అనంతరం కేంద్రం బాటలోనే మరో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ల దాఖలుకు సిద్ధమయ్యాయి.

ఈ నేపథ్యంలో జూలై 20 జంతర్ మంతర్ ఆందోళనకు సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవడంతో సహా, నిరసనకారులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో మరో ఆందోళన నిర్వహించాలన్న తమ పిలుపును ఉపసంహరించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీజేపీ అధికార ప్రతినిధి, సహ-కన్వీనర్ సౌరవ్ దాస్ ఈ ప్రకటన చేశారు. సీజేపీ నిర్ణయంపై సీజేఐ కూడా సానుకూలంగా స్పందించారు. ఇరుపక్షాలు సత్సంబంధాలు ప్రదర్శిస్తే, అన్ని సమస్యలను పరిష్కరించవచ్చని స్పష్టం చేశారు. దీంతో కేంద్రం కోరినట్లుగా సుప్రీంకోర్టు కూడా విద్యార్ధులపై ఎఫ్ఐఆర్ ల రద్దుకు ఆదేేశాలు ఇవ్వబోతోంది.














Click it and Unblock the Notifications