NEET PG: హైదరాబాద్ లో తీవ్ర విషాదం.. పరీక్షకు ఒక్క రోజు ముందు నీట్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య
నీట్ పీజీ పరీక్ష మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో షాకింగ్ ఘటన జరిగింది. అపరాజిత హాస్టల్ లో ఉంటూ గత ఆరు నెలలుగా నీట్ పీజీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత(24) తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. రేపే పరీక్ష ఉండటంతో.. ఒత్తిడి తట్టుకోలేక విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది యశ్విత. ఆ విద్యార్థిని కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె అని తెలుస్తోంది. తమ ఒక్కగానొక్క కూతురు సూసైడ్ చేసుకోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరీక్షల మానసిక ఒత్తిడే యువతి ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ లో రేపు నీట్ పీజీ పరీక్ష నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలుచోట్ల ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోని 4 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ నిఘా పెట్టినట్లు వివరించారు. ప్యారడైజ్ సర్కిల్, కింగ్ కోఠి, తాజ్ మహల్ జంక్షన్, బండ్లగూడలో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రేతిబౌలి, నానల్ నగర్, దుర్గానగర్, కేఎఫ్ సీ జంక్షన్ ల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పలు సూచనలు చేశారు.

అటు దేశవ్యాప్తంగా రేపు నీట్-పీజీ 2026 పరీక్ష నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరీక్షకు 2.73 లక్షల మందికి పైగా వైద్య గ్రాడ్యుయేట్లు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు పరీక్ష నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 12.5 శాతం పెరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications