జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన: రివ్యూలు అక్కడే: తొలి ఉత్తర్వులు ఇవే
Arvind Kejriwal: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆయన ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఇదే కేసులో భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈడీ అదుపులో ఉన్నారామె. ఈ నెల 26వ తేదీ వరకు ఆమెను ఈడీ కస్టడీకి తరలించింది ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం. ఈ నెల 23వ తేదీ నాటికే కస్టడీ ముగిసినప్పటికీ- ఈడీ విజ్ఞప్తి మేరకు దీన్ని పొడిగించింది.

ముఖ్యమంత్రి హోదాలో అరెస్ట్ అయిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందారు కేజ్రీవాల్. ఈడీ కస్టడీ నుంచే పరిపాలనను సాగిస్తోన్నారు. ఈ ఉదయం ఆయన అధికారులతో కలిసి రోజువారీ సమీక్షలను నిర్వహించారు. ఆదేశాలను సైతం జారీ చేశారు. ఢిల్లీ జలమండలికి సంబంధించిన ఆదేశాలు అవి.
వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ సమీక్షా సమావేశం కొనసాగింది. ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో మంచినీటి సరఫరాపై కేజ్రీవాల్ సమీక్ష చేపట్టారు. వర్చువల్‌గా మంత్రి ఆతిషి ఇందులో పాల్గొన్నారు. మంచినీటి ఎద్దడిపై ఓ నోట్ రూపంలో ఆదేశాలను ఇచ్చారు కేజ్రీవాల్. దీన్నిఇమెయిల్ చేశారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై మంత్రి ఆతిషి.. వెల్లడించనున్నారు. దీని కోసం ఈ ఉదయం 10 గంటలకు ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వేసవిలో ఢిల్లీలో ఏర్పడిన మంచినీటి ఎద్దడి, సరఫరా ఇతరత్రా అంశాలపై కేజ్రీవాల్‌తో జరిగిన సమీక్షా సమావేశం వివరాలను తెలియజేయనున్నారు.












Click it and Unblock the Notifications