ముఖ్యమంత్రి రెండో పెళ్లి: ముహూర్తం రేపే: పెళ్లికూతురు ఎవరంటే?
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. రెండో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గురువారం ఉదయం చండీగఢ్‌లోని నివాసంలో ఆయన పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌ను పెళ్లాడనున్నారు. అతి కొద్దిమందికి మాత్రమే ఆహ్వానం అందింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ వివాహానికి హాజరు కానున్నారు.
గుర్‌ప్రీత్ కౌర్ స్వస్థలం చండీగఢ్. వృత్తి రీత్యా డాక్టర్. భగవంత్ మాన్ తల్లి, చెల్లెలు ఏరికోరి గుర్‌ప్రీత్ కౌర్‌ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. భగవంత్ మాన్ మొదటి భార్య ఇందర్‌ప్రీత్ కౌర్. భగవంత్ మాన్-ఇందర్‌ప్రీత్ కౌర్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2016లో వారిద్దరూ విడిపోయారు. ఇందర్‌ప్రీత్ కౌర్ తన పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకార సమయంలో ఆమె.. తన పిల్లలతో కలిసి పంజాబ్‌కు వచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

మొదటి భార్యతో విడిపోయిన ఏడు సంవత్సరాల తరువాత భగవంత్ మాన్ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. భగవంత్ మాన్ తల్లి హర్‌పల్ కౌర్ ఒత్తిడి మేరకు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని అంటున్నారు. డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌ను కూడా తల్లే ఎంపిక చేశారని తెలుస్తోంది. తల్లి కోరిక కాదనలేక గుర్‌ప్రీత్ కౌర్‌ను పెళ్లాడనున్నారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

సంగ్రూర్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన వరుసగా రెండోసార్లు విజయం సాధించారు. అధికారంలోకి వస్తే- ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ కంటే మరో పేరు ఆమ్ ఆద్మీ పార్టీలో వినిపించలేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించారు. ఇటీవలే ముగిసిన సంగ్రూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం.. చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications