కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు: హోం మంత్రిగా
కర్ణాటక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్, తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిపాలనను వేగవంతం చేసే దిశగా, అత్యంత కీలకమైన శాఖలకు సీనియర్ మంత్రులను ఎంపిక చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన వద్దే అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను ఉంచుకున్నారు. వీటితో పాటు ఇంటెలిజెన్స్, పరిపాలనా సంస్కరణల విభాగం వంటి ప్రాధాన్యతా శాఖలు ఆయన పర్యవేక్షణలోనే ఉంటాయి. అదనంగా మంత్రులకు కేటాయించని మిగిలిన శాఖల బాధ్యతలను కూడా ఆయనే చూస్తారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ లభించిన జీ పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా మంత్రిత్వ శాఖలను కేటాయించారు.

మంత్రివర్గంలో ఇతర సీనియర్ నాయకులకు కీలకమైన బాధ్యతలు దక్కాయి. కేహెచ్ మునియప్పకు ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖను అప్పగించారు. కేజే జార్జ్ ఇంధనం, పర్యాటక శాఖలను చేపట్టనున్నారు. అలాగే ఎంబీ పాటిల్ భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖను పర్యవేక్షిస్తారు. రామలింగారెడ్డిని భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖకు మంత్రిగా నియమితులయ్యారు.
ప్రియాంక్ ఖర్గేకు హోం శాఖ లభించింది. ఇందులో నుంచి ఇంటెలిజెన్స్ ను మినహాయించారు. దీన్ని ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తారు. దీంతో పాటు ఐటీ, బీటీ, ఈ-గవర్నెన్స్ శాఖలు కూడా ప్రియాంక్ ఖర్గేకు లబించాయి. యూటీ ఖాదర్‌కు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం, సతీష్ జార్కిహోళికి ప్రజా పనుల శాఖ దక్కాయి. కృష్ణ భైరేగౌడకు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు అప్పగించారు. ఇందులో గ్రేటర్ బెంగళూరు అథారిటీతో పాటు నగరంలోని వివిధ జోనల్ కార్పొరేషన్లు, వాటర్ సప్లై, మెట్రో సంస్థలు కూడా ఉన్నాయి.
యతీంద్ర సిద్ధరామయ్యకు పట్టణాభివృద్ధి శాఖను అప్పగించారు. ఇందులో వాటర్ సప్లై, డ్రైనేజీ బోర్డు సహా పలు లోకల్ ప్లానింగ్ అథారిటీలు ఉంటాయి. ఇక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖను ఈశ్వర్ ఖండ్రేకు, రవాణా శాఖను బైరతి సురేష్‌కు, వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖను శరణ్ ప్రకాష్ పాటిల్‌కు కేటాయించారు. ఈ విస్తృత కేటాయింపులతో నూతన మంత్రివర్గం పూర్తి స్థాయి పరిపాలనకు సంసిద్ధమైంది.












Click it and Unblock the Notifications