రాహుల్ గాంధీపై ముప్పేట దాడి..!!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై ఎదురుదాడికి దిగారు.
రాహుల్ గాంధీ వాస్తవాలను వక్రీకరించారని, ప్రజల తీర్పును అవమానించారని దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. ప్రజలు ఎప్పుడో రాహుల్ గాంధీని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన తీసుకుంటోన్న నిర్ణయాలనూ వ్యతిరేకిస్తోన్నారని చురకలు అంటించారు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మహారాష్ట్ర ప్రజలను అవమానించినట్టేనని, దాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఫడ్నవిస్ తేల్చి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కూడా రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చారు.
దీనిపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఫడ్నవీస్ ఓ కాలమ్ రాశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో స్పష్టత లేదని, దేశ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోందని అన్నారు. ఆయన విభజన వాదాన్ని ప్రచారం చేస్తోన్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ నియామకాలనూ తప్పు పట్టినందుకు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.
ఫేక్ ఓటర్స్ అనే రాహుల్ గాంధీ వాదనలను ఫడ్నవీస్ తిప్పికొట్టారు. యువ ఓటర్ల పెరుగుదల గణనీయంగా నమోదైందని వివరించారు. 26 లక్షలకు పైగా యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని, దీనికి అనుగుణమైన డేటా ఉందని వివరించారు ఫడ్నవిస్.
ఎన్నికల కమిషన్ నుండి అందిన వివరణాత్మక లేఖను చదవాలని రాహుల్ గాంధీకి హితబోధ చేశారు ఫడ్నవిస్. 2024లో ఓటర్ల సంఖ్యకు సంబంధించి భిన్నంగా ఏమీ లేదని పేర్కొన్నారు.
చివరి నిమిషంలో అధిక ఓటింగ్ శాతం ఎన్డీఏ అభ్యర్థులకు అనుకూలంగా ఉందనే వాదనలను ఫడ్నవిస్ కొట్టి పారేశారు. వాటిని అర్ధ సత్యాలుగా, హాస్యాస్పదమైనవిగా వ్యాఖ్యానించారు. పెరిగిన ఓటింగ్ శాతం ప్రతిపక్ష అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చిందని, రాహుల్ గాంధీ కథనాన్ని సవాలు చేస్తూ ఆయన ఉదాహరణలను ముందుంచారు.
సాక్ష్యాలను దాచిపెట్టడం, వాటిని అర్థరహితంగా ప్రజల విశ్వాసానికి హానికరంగా ముద్ర వేయడం వంటి ఆరోపణలను కూడా ఫడ్నవీస్ ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయాన్ని హైలైట్ చేస్తూ రాహుల్ గాంధీ వాదనలకు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే సైతం స్పందించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. మహారాష్ట్ర గుండా సాగినప్పటికీ, ప్రజలు ఆయనను ఆదరించలేదని షిండే విమర్శించారు. ఆ సమయంలో రిజర్వేషన్లు, రాజ్యాంగ సవరణ గురించి తప్పుడు కథనాలు వ్యాపించాయని ఆయన ఆరోపించారు.
ఎన్నికల పరాజయాల తర్వాత నిరాశతో రాహుల్ గాంధీ నకిలీ కథనాలను సృష్టిస్తున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల గురించి రాహుల్ గాంధీ ఎలా అబద్ధం చెప్పారో నడ్డా వివరించారు. దీనిపై ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
ఎన్నికల్లో వరుస ఓటములపై ఆత్మపరిశీలనకు బదులుగా రాహుల్ గాంధీ కుట్రలు పన్నుతున్నారని, ఆధారాలు లేకుండా సంస్థలను కించపరుస్తున్నారని నడ్డా పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను నిరాధారమైనవిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది. దేశ ఎన్నికలు చట్టప్రకారం నిర్వహిస్తోన్నామని ఈసీ తేల్చి చెప్పింది.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, చట్టాన్ని అగౌరవపరచడం, ఎన్నికల సమయంలో పనిచేసే ఎన్నికల సిబ్బందిని కించపరిచినట్లుగా ఉందని ఈసీ పేర్కొంది. ప్రతికూల ఫలితాలు వెలువడిన తరువాత తమను అప్రతిష్టపాలు చేయడం అసంబద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications