10 అంశాలపై ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ, యదాద్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానం..
ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు. 50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం కోరారు. తెలంగాణకు సంబంధించిన పది అంశాలపై ప్రధానికి లేఖలు అందజేశారు. కేసీఆర్ వినతిపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని సమాచారం. యదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఆహ్వానించగా.. తప్పకుండా వస్తాను అని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

10 అంశాలు ఇవే..
ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలని మోడీని సీఎం కేసీఆర్ కోరారు. అలాగే రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని విన్నవించారు. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని కోరారు. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని.. 10 అంశాలకు సంబంధించిన లేఖలు అందజేశారు.

తెలంగాణ భవన్.. యదాద్రికి ఆహ్వానం..
ఢిల్లీలో రాష్ట్ర అధికార భవన్ 'తెలంగాణ భవన్' నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని, యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీని సీఎం కోరారు. సీఎం అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా, అన్ని రాష్ట్రాలకు ఢిల్లీ కేంద్రంగా భవనాలు ఉన్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా అధికారిక భవనం "తెలంగాణ భవన్" నిర్మించుకునేందుకు, ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలని ప్రధానిని సీఎం కోరారు.

తప్పకుండా వస్తా..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తికావస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని, సీఎం కేసిఆర్ ఆహ్వానించారు. అక్టోబర్, నవంబర్‌లో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం ఆహ్వానానికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభ మహోత్సవానికి తాను తప్పకుండా హాజరవుతానని స్పష్టమైన హామీ ఇచ్చారని సమాచారం.












Click it and Unblock the Notifications