కాక్రోచ్ జనతా పార్టీ వీపుపై విరిగిన లాఠీలు- మెట్రో స్టేషన్లు మూసివేత: తీవ్ర ఉద్రిక్తత
దేశ రాజధానిలో మరోసారి రాజకీయ సెగలు రాజుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాక్రోచ్ జనతా పార్టీ బరిలోకి దిగింది. ఛలో పార్లమెంట్ ఆందోళనకు పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ భవనం దిశగా ర్యాలీగా తరలి వెళ్లడానికి ప్రయత్నించిన ఆ పార్టీ మద్దతుదారుల వీపులపై లాఠీలు విరిగాయి. నిరసనకారులను చెల్లాచెదురు చేశాయి.
ఛలో పార్లమెంట్ నేపథ్యంలో రెండురోజులుగా జంతర్ మంతర్ వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ బలగాలు, ఢిల్లీ పోలీసులు, ఇతర పారా మిలటరీ సిబ్బంది మోహరించారు. దాదాపు 1,500 మంది పోలీసులు అక్కడ విధి నిర్వహణలో ఉన్నారు. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ లను అందుబాటులో ఉంచుకున్నారు. ఈ ప్రాంతం మొత్తాన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఛలో పార్లమెంట్ కు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడిన ఆందోళనకారులను అక్కడి నుంచి కదలనివ్వలేదు.

చుట్టూ బ్యారికేడ్లు, ఫెన్సింగులను అమర్చారు. బయటి నుంచి కూడా ఒక్కరినీ లోనికి రానివ్వలేదు. లోక్ సభ సభ్యులు చంద్రశేఖర్ ఆజాద్, మహువా మొయిత్రాలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ పరిస్థితుల్లోనూ ఆజాద్.. అభిజిత్ డిప్కే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వేదిక వద్దకు చేరుకోగలిగారు. ఆయనకు సంఘీభావాన్ని తెలిపారు.
న్యూఢిల్లీ జిల్లా పరిధిలో బీఎన్ఎస్ సెక్షన్ 163ను అమల్లోకి తెచ్చారు. గతంలో ఉపయోగించిన సీఆర్‌పీసీ సెక్షన్ 144 స్థానంలోనే కొత్త చట్టం ప్రకారం ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనల ప్రకారం నిర్దేశిత ప్రాంతాలలో అయిదుమంది లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం పూర్తిగా చట్టవిరుద్ధం. నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడ ఎవరైనా నిరసనలకు దిగితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత ఆందోళనలు తెలుపుకోవడానికి పరిమిత అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. పార్లమెంట్ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, సభలపై కఠిన ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రజాప్రతినిధుల రక్షణ, విదేశీ రాయబారుల భద్రతతో పాటు ప్రభుత్వ కార్యాలయాల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని, అందుకే నగరవ్యాప్తంగా అదనపు రక్షణ వలయాలు ఏర్పాటు చేసినట్లు అడ్వైజరీలో పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. జన్ పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రెటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ మూసివేత కొనసాగుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications