Cognizant కత్తి: అయిదు నిమిషాల బ్రేక్ తీసుకున్నా రెడ్ అలర్ట్..!
ఐటీ రంగంలో దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ షాకింగ్ రూల్ ను ప్రవేశపెట్టింది. ఉద్యోగులపై అనుక్షణం నిఘా ఉంచడానికి ఉద్దేశించిన రూల్ అది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై డేగకన్ను వేసింది. వారిని పర్యవేక్షించడానికి కఠినమైన నిఘా వ్యవస్థను అమలు చేస్తోంది. ఇకపై కాగ్నిజెంట్ ఉద్యోగులు అయిదు నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్నా సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ కు తెలిసిపోతుంది. వాళ్లు ఏం చేస్తోన్నారనేది పసిగడుతుంది.
దీనికి సంబంధించిన ఓ టూల్ ను కాగ్నిజెంట్ యాజమాన్యం దశలవారీగా ఉద్యోగులందరి ల్యాప్ టాప్ లల్లో అమర్చబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ టూల్ ను అమర్చిన తర్వాత.. ల్యాప్‌టాప్‌లో ఓ అయిదు నిమిషాల పాటు ఎటువంటి కార్యకలాపాలు లేకపోయినా అది మేనేజ్మెంట్ తెలిసిపోతుంది. ఇటువంటి ఉద్యోగులను ఇనాక్టివ్ గా గుర్తిస్తుంది. దీనికోసం కంపెనీ 'ప్రోహాన్స్' అనే టూల్‌ను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ప్రతి అయిదు నిమిషాల పాటు కీబోర్డ్ లేదా మౌస్ లో ఎటువంటి కదలిక లేకపోతే సదరు ఉద్యోగిని ఇనాక్టివ్ గా గుర్తిస్తారు. లాగిన్ అయినప్పటికీ- ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. ఆ తర్వాత కంపెనీ నిబంధనల ప్రకారం.. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక కథనాన్ని బిజినెస్ వెబ్ సైట్ మింట్ ప్రచురించింది.
ప్రోహాన్స్ అనేది ఓ వర్క్‌ఫోర్స్-మేనేజ్‌మెంట్ టూల్. దీని ద్వారా మౌస్, కీబోర్డ్ కదలికలు, వాటి వినియోగాన్ని ట్రాక్ చేస్తుంది కాగ్నిజెంట్ మేనేజ్మెంట్. దీని ఆధారంగా ఆ ఉద్యోగి ప్రొడక్టివిటీని అంచనా వేస్తుంది. సుమారు నెల రోజులుగా అమల్లో ఉన్న ఈ చర్యల వల్ల.. మైక్రో లెవెల్-ట్రాకింగ్‌పై కంపెనీ దృష్టి సారించినట్టయింది.
300 సెకన్లు పాటు అంటే అయిదు నిమిషాల పాటు కీబోర్డ్ లేదా మౌస్ లో ఎటువంటి కదలికలు లేకపోయినా ఆ ఉద్యోగి మేనేజ్మెంట్ రాడార్ లోకి వెళ్తాడు. ఒకవేళ ఉద్యోగి కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ 15 నిమిషాల పాటు ఇన్ యాక్టివ్ గా ఉంటే ఆ ఉద్యోగి తన సీట్ లో లేడని నిర్ధారిస్తారు. ఆ తర్వాత అతన్ని ఏం చేయాలనేది మేనేజర్/టీమ్ లీడర్ నిర్ధారిస్తారు. దానికి గల ఇన్ యాక్టివ్ గా ఉండటం లేదా సీట్ లో లేకపోవడానికి సంతృప్తికర కారణాలను వివరించాల్సి ఉంటుంది.
ఉద్యోగుల కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ప్రోహాన్స్ వంటి టూల్‌ను ఉపయోగించే ఏకైక సంస్థ కాగ్నిజెంట్ ఒక్కటే కాదని, విప్రో వంటి ఇతర ఐటీ సంస్థలు కూడా దీన్ని వినియోగిస్తోన్నాయని మింట్ తెలిపింది. ఉద్యోగులు ప్రోహాన్స్ ద్వారా ట్రాక్ చేయడానికి ముందు తమ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు తప్పనిసరిగా ఓకే అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications