దోమల మందు పిచికారీ.. ఊపిరాడక ఇద్దరు మృతి.. ఎక్కడంటే..?
డెంగ్యూ నివారణ కోసం పంచాయతీ సిబ్బంది దోమల మందు పిచికారీ చేసింది. అయితే ఆ పొగ పీల్చి ఊపిరాడక ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన తమిళనాడు కోయంబత్తూర్ లోని అన్నూర్ టౌన్ లో జరిగింది. డెంగ్యూ నివారణకు కొట్టిన దోమల మందు ఇద్దరి ప్రాణాలను తీయడంతో అన్నూర్ లోని 7 వ వార్డులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇటీవల ఈ ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు డెంగ్యూ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అన్నూర్ టౌన్ పంచాయతీ పరిపాలన విభాగం ఆ ప్రాంతంలో దోమల మందు పిచికారీ చేపట్టింది. ప్రతి ఇంటికి వెళ్లి దోమల మందు పిచికారీ చేసింది. అన్నూర్, సతీ రోడ్డు, ఉప్పుతొత్తమ్ ప్రాంతాల్లో దోమల నివారణకు పిచికారీ చేపట్టింది సిబ్బంది. డ్రైనేజీ, మురికి కాలువలు, చెత్తతో నిండిన ప్రదేశాలు, మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ జరిగింది. ఈ క్రమంలో పంచాయతీ వర్కర్లు.. ఈ ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా ప్రవేశించి దోమల మందు పిచికారీ చేపట్టారు.
ఈ క్రమంలో ఉప్పుతొత్తమ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో కూడా దోమల మందు పిచికారీ చేశారు. అయితే ఆ కెమికల్స్ తో ఇంట్లోని ఇద్దరు వృద్ధులు మోహన్(65), రాణి అలియాస్ ప్రేమ(75) ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. వీళ్లిద్దరూ గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి వద్ద నుంచే చికిత్స తీసుకుంటున్నారు.
మృతుల కుటుంబ సభ్యలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహన్, ప్రేమ ఇద్దరూ దోమల మందు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అలా గంటల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ఇంట్లో మందు పిచికారీ చేయొద్దని తాము వర్కర్స్ కు చెప్పినా వాళ్లు తమ మాటలను పట్టించుకోలేదని తెలిపారు. అంతేకాక కొద్ది నీళ్లలో అధిక మోతాదులో దోమల మందును కలిపి పిచికారీ చేశారని కాలనీవాసులు ఆరోపించారు.

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications