అసెంబ్లీ ఎన్నికలొస్తున్నాయ్: ఎల్పీజీ సిలిండర్ల ధరను తగ్గించిన మోడీ సర్కార్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం దేశ ప్రజలకు కొత్త సంవత్సరం కానుకను ప్రకటించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఒక్కో వంటగ్యాస్ సిలిండర్ రేటును రూ.102.50 పైసల మేర తగ్గించింది. ఈ రేట్లు ఈ తెల్లవారు జాము నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కేటగిరీకి చెందిన ఎల్పీజీ వంటగ్యాస్ ధరలను నెల రోజుల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పెంచింది. ఇప్పుడు దాన్ని తగ్గించింది.

వరుసగా రెండు నెలల పాటు పెంచి..
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకు వరుసగా రెండుసార్లు రేట్లను పెంచిన విషయం తెలిసిందే. నవంబర్, డిసెంబర్ నెలల వ్యవధిలోనే మోడీ సర్కార్.. 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్‌పై మోపిన భారం రూ. 369.50 పైసలు. నవంబర్‌లో 266 రూపాయలు, డిసెంబర్‌లో రూ.103.50 పైసలను పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటాయి. 2,000 రూపాయలను దాటేశాయి.

దేశవ్యాప్తంగా వ్యతిరేకత..
దీని పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల మనుగడ తలకిందులైంది. కమర్షియల్ వంటగ్యాస్‌ను వినియోగించే చిరు వ్యాపారులు ఇప్పటికే అనేక ఇక్కట్ల బారిన పడ్డారు. దీనికితోడు హోటళ్లల్లో వినియోగించే సిలిండర్ల ధర పెరగడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత దెబ్బతిన్నాయి. పెరిగిన వంటగ్యాస్ ధరకు అనుగుణంగా వారు తమ రేట్లను కూడా పెంచడం వల్ల మధ్య తరగతి కుటుంబీకులు చిరుతిళ్లను కొనుక్కుని తినలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు.

ఊరట కలిగించేలా..
ఇప్పుడు వారందరికీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్ల ధరలను రూ.102.50 పైసల మేర తగ్గించింది. తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో ఒక్కో సిలిండర్ రేటు రూ.1,998.50 పైసలకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.1,948.50 పైసల వద్ద నిలిచింది. కోల్‌కతతో పాటు చెన్నైల్లో అత్యధికంగా కమర్షియల్ సిలిండర్ రేటు ఇంకా 2,000 రూపాయల పైమాటే.

చెన్నైలో అత్యధికంగా..
కోల్‌కతలో కమర్షియల్ ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.2,072 పైసలు, చెన్నైలో రూ.2,132 పైసలుగా నమోదైంది. గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల జోలికి మాత్రం వెళ్లలేదు. వాటి రేట్లల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. యధాతథంగా కొనసాగిస్తోంది. 14.2 కేజీల బరువు ఉండే గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్‌లో పాత రేటే కొనసాగుతోంది. డొమెస్టిక్ కేటగిరీలోని ఎల్పీజీ సిిలిండర్ ధర రూ.899.50 పైసలుగా ఉంది. కోల్‌కతలో 926 రూపాయలు, చెన్నైలో రూ.915.50 పైసలుగా ఉంటోంది.

జనవరి నుంచి జనవరి వరకు..
గత సంవత్సరం మొదట్లో 694 రూపాయలు పలికిన గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ రేటు.. ఇప్పుడు 900 రూపాయల మార్క్‌ను దాటింది. దీపావళి తరువాత వెయ్యి రూపాయలను అధిగమిస్తుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 300 రూపాయలకు పైగా గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల మీద భారం పడింది. కమర్షియల్ సిలిండర్ల రేట్లను పెంచిన ఈ రెండు సార్లు కూడా కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ల జోలికి వెళ్లలేదు.

తగ్గింపు రెండోసారి..
కేంద్ర ప్రభుత్వం ఇలా పెంచిన రేట్లను తగ్గించడం ఇది రెండోసారి. ఇదివరకు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. గత ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని ఇంధన ధరలను తగ్గించింది. పెట్రోల్‌పై అయిదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర కస్టమ్స్ డ్యూటీని కుదించింది. ఫలితంగా వాటి రేట్లు దిగొచ్చాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పలు రాష్ట్రాలు కూడా తాము విధించిన వ్యాట్‌ను తగ్గించడం వల్ల చాలాచోట్ల పెట్రోల్ ధర 100 రూపాయలలోపు ఉంటోంది.
Recommended Video

ఎన్నికలొస్తొన్నాయ్..
ఈ సంవత్సరం మొత్తం ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తొలిదశలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వెలువడటానికి అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లల్లో మార్చి-మే నెలల్లో దశలవారీగా అసెంబ్లీ పోలింగ్ షెడ్యూల్ ఉంటుంది.
పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. గత ఏడాది ఉప ఎన్నికల్లో కొంత వ్యతిరేక ఫలితాలను చవి చూసింది బీజేపీ. దాని ప్రభావం ఈ ఎన్నికల మీద పడకుండా- ఇదివరకు పెంచిన రేట్లను బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.












Click it and Unblock the Notifications