అవును..నాన్ వెజ్ తిని ఆంజనేయుడి గుడికి వెళ్లా- అయితే ఏంటీ: బీజేపీ ఎమ్మెల్యే
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న వేళ- అధికార బీజేపీ ఇరుకున పడింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీటీ రవి నాన్ వెజ్ తిని గుడికి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన అంగీకరించారు కూడా.
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ- ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న తొమ్మిది రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన కర్ణాటకలో ఇప్పటికే ఎదురుదెబ్బలను చవి చూస్తోంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించే ఈ ఎన్నికల్లో పరిస్థితులు పెద్దగా అనుకూలించేలా కనిపించట్లేదు. పార్టీ అధికారంలోకి రాదని ముందుగానే అంచనాలను వేసుకున్న సీనియర్లు ఒక్కొక్కరుగా సర్దుకుంటోన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

తెలంగాణ సహా..
ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. త్రిపురలో పోలింగ్ కూడా పూర్తయింది. ఈ నెల 27వ తేదీన మేఘాలయా, నాగాలాండ్ లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. . మిగిలిన కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లల్లో ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది.

కర్ణాటకలో కీలకం..
పొరుగునే ఉన్న కర్ణాటకలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ లల్లో పోలింగ్ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. ఎప్పట్లాగే ఈ దఫా కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి కూడా- ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

నాన్ వెజ్ పాలిటిక్స్..
ఈ పరిణామాల మధ్య బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చిక్‌మగళూరు శాసన సభ్యుడు సీటీ రవి చిక్కుల్లో పడ్డారు. నాన్ వెజ్ తిని- ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్లినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా భత్కల్ లో పర్యటించిన సీటీ రవి స్థానిక నాయకులతో కలిసి నాన్ వెజ్ తిన్నారు. అనంతరం భత్కల్ లోని నాగబాన-కరిబంత ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్లారు.

అవును వెళ్లా..
ఈ విషయాన్ని సీటీ రవి అంగీకరించారు. తాను మాంసాహారాన్ని తిని గుడికి వెళ్లానని చెప్పారు. ఆ సమయం గర్భగుడి తలుపులు మూసి ఉన్నాయని, దీనితో తాను స్వామివారిని దర్శించుకోకుండానే వెనక్కి తిరిగి వచ్చానని అన్నారు. గర్భగుడిలోకి వెళ్లలేదని వివరించారు. నాన్ వెజ్ తినడం వ్యక్తిగత విషయమని పేర్కొన్నారు. సీటీ రవి గుడిలోకి వెళ్లడం, ఆలయ పాలక మండలి సభ్యులు ఆయనను స్వాగతించడం, ప్రదక్షిణలు చేయడానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాంగ్రెస్ ఫైర్..
ఈ ఘటనపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. హిందూయిజానికి బ్రాండ్ అంబాసిడర్లమంటూ చెప్పుకొంటోన్న బీజేపీ నాయకులు- సీటీ రవిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తోన్నారు. గతంలో తాను చాపలకూరను తిని గుడికి వెళ్లినట్లు బీజేపీ తప్పుడు ప్రచారం చేసిందని, ఇప్పుడు నాన్ వెజ్ తిని ఆలయానికి వెళ్లినట్లు సీటీ స్వయంగా అంగీకరించారని ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య పేర్కొన్నారు.

ఏ చర్యలు తీసుకుంటారు..
జనతాదళ్ (సెక్యులర్) నాయకులు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. నాన్ వెజ్ ను తినడం వ్యక్తిగత విషయమే అయినప్పటికీ- ఆ తరువాత గుడికి వెళ్లడంపై అభ్యంతరం ఉందని పేర్కొంది. సీటీ రవిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నిలదీసింది. దీనిపై ఇప్పటివరకు బీజేపీ నాయకులు పెదవి విప్పట్లేదు. ఎవరూ దీనిపై స్పందించట్లేదు. వివరణ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు.












Click it and Unblock the Notifications